
ఆషాడం ప్రత్యేకం, జూలై 04 : తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాపితంగా మరిడమ్మ అమ్మవారి జాతరను ఆషాఢ మాసంలో స్మరించుకుంటారు. జేష్ఠ మాస అమావాస్య నుండి ఆషాడ మాసం అమావాస్య వరకూ 37 రోజులు కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ దర్శనానికి జనం పోటె త్తుత్తారు. ఆషాఢ మాసం.. మరిడమ్మ విశేషాలు గమనిస్తే.. కలియుగ కల్పతరువైన వర్షఋతువు ఆషాడం నుంచి మొదలవుతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతల సంస్మరణలకు అమోఘకాలం. దాన, జప, పారాయణ, సముద్ర, నదీ స్నానాలకు ముక్తిదాయకం. చెప్పులు, గొడుగు, దానం చేయడం విశిష్ట ఫలితం. ఉగాదికాల మానంగా నాలుగవ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలతో వున్న నెలను ఆషాడ మాసం అంటారు. శూన్య మాసంగా పిలుస్తారు. ఈ ఏడాది ఆషాడ మాసం జూలై 6న ప్రారంభమై.. ఆగష్టు 4న ముగుస్తుంది. ఈ నెలలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమగా వ్యాస పూర్ణిమగా మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును నిర్వహిస్తారు. ఆషాడ శుద్ద విదియ రోజున పూరీ జగన్నాదుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర జరుగుతుంది. ఆషాడ సప్తమిని భానుసప్తమిగా ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరి పగలు రాత్రి నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయని.. ఆషాఢ శుద్ధ ఏకాదశి తిధిన విష్ణువు పాల కడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారని ఈ నెలల్లోని ఏకాదశిని తొలిఏకాదశిగా శయన ఏకాదశిగా చాతుర్మాస వ్రత దీక్ష చేపడతారు. గ్రామ దేవతలకు నీరాజన ఉత్సవాలు జరుపుతారు. ఆషాడ మాసం అనారోగ్య మాసం కూడా.. విపరీతమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే నెల.. దీంతో కాలువలలోను, నదులలోను ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. వ్యాధుల బారిన పడతారు. ఈ నెలలో కొత్తగా పెళ్లి అయిన జంట అత్తగారి ఇంట్లో అడుగు పెట్టకూడదనే సంప్రదాయం వుంటుంది. ఆషాడ మాసంలోని కొత్తనీరు త్రాగటం వల్ల రోగాలు వచ్చే సమయమని, తినే ఆహారం విషయంలో నియమాలు పాటిస్తారు.. 17వ శతాబ్దంలో మారెమ్మగా కలరా మసూచికా బారినుండి కాపాడిన అమ్మగా చింతపల్లి వారి ఆడపడుచుగా వెలిసిన చరిత్రతో కాలగతిలో మరిడమ్మగా ప్రసిద్ది చెందిన మరిడమ్మ తల్లి ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత. 1952 నుండి దేవాదాయ శాఖ పర్యవేక్షణలో వున్న ప్రముఖ ఆలయం. పెద్దాపురం మానోజీ చెరువుకి అతి సమీపంలో అమ్మవారు వెలిసిన చరిత్ర ప్రసిద్ధి. మరిడమ్మ తల్లి కొలువై వున్న ప్రాంతం అంతా చిట్టడివిగా వున్న అప్పటి పూర్వ రోజుల్లో ఆనాటి పశువుల కాపరులకు 16 ఏళ్ల అమ్మాయి కనిపించి చింతపల్లి ఆడపడుచు ఇక్కడ వుందని మావాళ్ళకి చెప్పండని ఆ యువతి చెప్పిన మరుక్షణం ఆ మాటలు ఆలకించిన వారికి కనిపించకపోవడం.. చింతపల్లి కుటుంబానికి అంతకు మునుపే మరిడమ్మ అమ్మవారు మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసినదిగా కోరుతున్నట్లు మనోజ్ఞాన సంకల్పంగా వారికి ఆశావహం కావటం.. మానోజీ చెరువు చుట్టు పక్కల ప్రాంతాలు వెతకగా లభ్యమైన పసుపు కర్ర రాతిప్రతిమ లభ్యం కాగా వాటిని యధా స్థానంలో అక్కడనే వుంచి తాటాకు పందిరిలో గద్దెను ప్రతిష్ఠించి ఆరాధించటం జరిగింది. ఆనాటినుండి ఆ గ్రామంలో ప్రతిగడప శోభాయమానంగా వైభవం కావడంతో అదేరీతిగా పూర్వీకులనుండి ప్రతీసంవత్సరం జేష్ఠమాస అమావాస్యనుండి ఆషాడమాసంలోని అమావాస్య వరకూ 37 రోజుల జాతర సంస్కృతి నిర్వాహణ ఏర్పడిరది. దశ దిశలా వ్యాపించిన శుభ సందేశంతో శ్రీమరిడమ్మదర్శనానికి విశేషంగా భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు. అమావాస్యకు పక్షంరోజులు ముందు ఉయ్యాల తాడి వేయడం ఇక్కడి ప్రాచీన సంప్రదాయం. జాతర ముగిసే వరకూ అమ్మ వారితో ఆమె ఆడపడు చులు ఉయ్యాల తాడి వద్దనుండి భక్తుల ఆలనాపాలన చూస్తారని ప్రగాఢ నమ్మిక. ఉయ్యాలతాడిని అక్కడి రైతుల పొలాల గట్లమీద ఎంపిక చేసి సమర్పిస్తారు. ఉయ్యాల తాడిని భుజాల మీద మోస్తూ ఊరేగింపుగా డప్పులు, గరగలతో ఆడపడుచులు తాడిలకు స్నానం చేయించి పసుపు, కుంకుమరాసి పాతపెద్దాపురం కోటముందు నుండి గుడివద్దకు సాగనంపుతారు. మొట్టమొదటి జాతర పాత పెద్దాపురంకోట ముందు గ్రామస్థులు నిర్వహిస్తారు. గత ఏడాది కాకినాడ భోగి గణపతి పీఠం నుండి చేపట్టిన తిరుమల తిరుపతి పాదయాత్రలో కాలినడకన పెద్దాపురం మరిడమ్మ వారిని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దర్శించి నిద్రచేసిన మహద్భాగ్యం కలిగింది. మరిడమ్మ తల్లిదయ వుంటే శ్రీకర శుభకర జయకర మంగళకర ఆశీస్సులతో అన్నీ వున్నట్టేనని.. భావిస్తూ ఆడపడుచులతో ఇంటింటా మరిడమ్మ దర్శనాన్ని ఆషాఢ సంప్రదాయంగా ఆచరిస్తారు. శుభం భూయాత్