జగన్‌తో ఎమ్మెల్యే రఘురామ భేటీ
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్, తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య సంభాషణ జరిగింది. సమావేశాలు జరిగినన్ని రోజులూ సభకు రావాలని జగన్‌ను రఘురామ కోరగా.. హాజరవుతానని ఆయన బదులిచ్చారు. వాళ్లిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో వైకాపా ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైకాపా ప్రభుత్వం, జగన్ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఈ క్రమంలో రఘురామ అరెస్ట్ తదితర పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో జగన్, రఘురామ ఏం మాట్లాడుకున్నారనేదానిపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్‌ను ఆయన ఛాంబర్‌లో భాజపా ఎమ్మెల్యేలు కలిశారు. చాలా మంది వైకాపా నేతలు భాజపా వైపు చూస్తున్నారనే అంశంపై వారి మధ్య కాసేపు చర్చ జరిగింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. అలాంటిది ఏదైనా ఉంటే ఉమ్మడిగా నిర్ణయిద్దామని చెప్పారు.