
విల్లివాకం న్యూస్: నగరంలో ఆర్ట్ ఆఫినిటీ పేరిట గ్రూప్ ఆర్ట్ షో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. దీనికి చెన్నై గ్రీమ్స్ రోడ్డులో గల లలిత అకాడమీ హాలు వేదికయింది. ఇందులో గౌరవ అతిథులుగా సాయి ఆర్ట్స్ అధినేత, చిత్రకళారత్న ఇ. వేదాచలం, సినీ పబ్లిసిటీ డిజైనర్, సింధూర్ గ్రాఫిక్స్ అధినేత, చిత్రకళారత్న లిపిశిల్పి జి. అంకయ్య పాల్గొన్నారు.
ఈ ప్రదర్శనలో 69 మంది చిత్రకారులు వైవిద్య భరితమైన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు ఇందులో ఆయిల్, అక్రైలిక్, అబ్ స్ట్రాక్ట్, రియలిజం, స్కల్ప్ చర్, వుడ్ కార్వింగ్ తదితరాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రదర్శనలో హైదరాబాదుకు చెందిన గాయత్రి, లక్ష్మీరేఖ, ఓరుగంటి సుజాత తమ చిత్రాలను ప్రదర్శించారు.
వీరు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఏర్పాటైన ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఇక్కడ 26 నుంచి 30 తేదీ వరకు ఇద్దరు చిత్రకారులు డెమో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనకు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను మోహనుడు, రవి, గాయత్రి రాజా చేపట్టారు.