
*టీవీకే చుట్టూ తిరుగుతున్న తమిళనాడు రాజకీయాలు..?
*పొత్తుల పేకాటలో విజయ్ పార్టీ కీలక మలుపు….
చెన్నై న్యూస్:తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమిలో సీట్ల పంపకాలపై భిన్నాభిప్రాయాలు బయటపడుతుండగా, ఈ పరిణామాలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే దిశగా సాగుతున్నాయి. ఈ మొత్తం రాజకీయ గందరగోళానికి కేంద్రబిందువుగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మారడం విశేషం.
డీఎంకే–కాంగ్రెస్ మధ్య ఇప్పటికే సీట్ల షేరింగ్ చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి కనీసం 40 అసెంబ్లీ స్థానాలు తమకు కేటాయించాలని పట్టుబడుతోంది. అయితే డీఎంకే మాత్రం 32 సీట్లకే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇరు పార్టీల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఊపునిచ్చాయి. “కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలని కోరుకుంటోంది” అని ఆయన స్పష్టం చేయడం, కాంగ్రెస్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్న సంకేతాల్ని ఇస్తోంది. కనీసం 38 సీట్లైనా కావాలన్న డిమాండ్ పై పార్టీ గట్టిగా నిలబడుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో ప్రత్యామ్నాయం కూడా కనిపిస్తోంది. అదే — విజయ్ టీవీకే. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఫిలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. “కాంగ్రెస్, టీవీకే సహజ మిత్రులు. రాహుల్ గాంధీ, విజయ్ మధ్య మంచి స్నేహం ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొత్తుల రాజకీయాన్ని కొత్త దిశగా మళ్లించాయి.
ఇదే సమయంలో బీజేపీ కూడా రంగంలోకి దిగింది. టీవీకే పార్టీతో పొత్తు అవకాశాలపై బీజేపీ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం వెనుక కూడా ఈ రాజకీయ లెక్కలే ఉన్నాయన్న కథనాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, టీవీకే నేతలు మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. “అన్ని పార్టీలతో చర్చల అనంతరం మా అధినేత విజయ్ నిర్ణయం తీసుకుంటారు” అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలతో, తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ‘కింగ్‌మేకర్’ పాత్ర పోషించే అవకాశాలు పెరిగినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో, తమిళనాడు రాజకీయాలు జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చివరికి విజయ్ ఏ పార్టీతో చేతులు కలుపుతారన్నదే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారింది.