
చెన్నై న్యూస్:రోగాలకు చికిత్స రాగాల ద్వారానే సాధ్యమవుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ సంగీతాన్ని ఆస్వాదించాలని పద్మభూషణ్ డాక్టర్ కె. ఐ. వరప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. వేద విజ్ఞాన వేదిక (తరతరాల తెలుగు కవిత) 16వ వార్షికోత్సవ మహోత్సవం ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఆస్కా ప్రాంగణంలోని గోదావరి హాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు.
ఈ సభకు వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి అధ్యక్షత వహించగా, శ్రీమతి అరుణ శ్రీనాథ్ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ సినీనటి ఊర్వశి శారద, ప్రభ రమేష్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. వేదిక కార్యదర్శి కందనూరి మధు అతిథులను ఆహ్వానిస్తూ స్వాగత ఉపన్యాసం చేశారు.
ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కె. ఐ. వరప్రసాద్ రెడ్డి, విశిష్ట అతిథిగా కళారత్న ప్రభ రమేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా–సాహిత్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తెలుగు కార్యక్రమాలకు పెద్దవాళ్లు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలను తీసుకురావడం ద్వారా యువతలో భాషపై మమకారం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సాహిత్యం, భాష, సంగీతం అనేవి కేవలం డిగ్రీల కోసం కాకుండా మన సంస్కృతి విలువలను తెలుసుకునే మార్గదర్శకాలని తెలిపారు.
ఆరోగ్యానికి సంగీతం ఎంతో అవసరమని, రోగాలకు రాగాలు కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయని చెప్పారు. భారత, రామాయణ, భాగవతాలలో ఉన్న జీవన విలువలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని సూచించారు. “మనమే తెలుగు భాషను కాపాడటం కాదు… తెలుగు భాషే మనల్ని కాపాడుతుంది” అని పేర్కొన్నారు.
విశిష్ట అతిథి కళారత్న ప్రభ రమేష్ మాట్లాడుతూ తాను ఇటీవల సితార్లో అక్షరాలు నేర్చుకుంటున్నానని, వేద విజ్ఞాన వేదిక ద్వారా ‘సితార్ నీరాజనం’ అందించడం ఆనందంగా ఉందన్నారు. గత పదహారేళ్లుగా ప్రాచీన మరియు ఆధునిక సాహిత్యాన్ని క్రమశిక్షణతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
వేదిక అధ్యక్షుడు జేకే రెడ్డి మాట్లాడుతూ చెన్నై మహానగరంలోని నలుమూలల నుంచి తెలుగు సాహితీ ప్రియులు పదహారేళ్లుగా కార్యక్రమాలకు హాజరవుతూ సంస్థను ముందుకు నడిపిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. యువతరానికి తెలుగు భాష మాధుర్యాన్ని పరిచయం చేయడానికి మరింత కృషి చేస్తామని చెప్పారు.
కార్యదర్శి కందనూరి మధు మాట్లాడుతూ తెలుగు భాష మాధుర్యాన్ని నేటి తరానికి చేరవేస్తూ 16 సంవత్సరాలుగా క్రమశిక్షణ, సమయపాలనతో కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం శ్రీమతి ప్రభ రమేష్ ‘సితార్ నీరాజనం’, కుమారి భవ్య తూములూరు ‘సంగీత నీరాజనం’ సభికులను అలరించి ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు, భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

…………..