
హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలు భరించలేక, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు తీసుకున్నారు.
ఎం జరిగింది?
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి (44) కుటుంబం గత ఏడాది హబ్సీగూడకు మారింది. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసిన ఆయన, ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేశారు. దీంతో, కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది.
ఈ సమస్యలతో తీవ్రంగా బాధపడిన చంద్రశేఖర్, మొదట తన 15 ఏళ్ల కుమార్తె శ్రీత రెడ్డిని ఊరేసి చంపాడు. అనంతరం, 10 ఏళ్ల కుమారుడు విశ్వాన్ రెడ్డికి విషం ఇచ్చి హత్య చేశాడు. చివరగా, భార్య కవితతో కలిసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
పోలీసులు ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో చంద్రశేఖర్ తన మానసిక, ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ—
“నా చావుకు ఎవరూ కారణం కాదు. వేరే మార్గం లేకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మానసికంగా, శారీరకంగా, కెరీర్ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు…” అని రాశారు.
ఈ ఘటన హబ్సీగూడలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.