
అమరావతి న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక ముందడుగు పడింది. ఎస్సీ రిజర్వేషన్ల పంపిణీలో సమానత్వాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి ఏపీ క్యాబినెట్ ఆర్డినెన్స్‌ను ప్రకటించింది.
ఈ ఆర్డినెన్స్ ద్వారా, ఇప్పటిదాకా రిజర్వేషన్ల లాభాలు అందని ఎస్సీ ఉపవర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేసింది. గతంలో ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమాల ప్రభావంతో ఈ అంశం మళ్లీ ప్రాధాన్యతకు వచ్చింది. ఆయన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, తగిన చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా, జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిని అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన అనంతరం ఇప్పుడు అధికారికంగా ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.
ఈ చర్యతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా తిరిగి ప్రారంభం కానుంది. ముఖ్యంగా, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఐదు రోజుల్లో వెలువడనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. తదుపరి ఇతర ఉద్యోగ ప్రకటనలూ త్వరలో వెలువడనున్నాయి.