విల్లివాకం న్యూస్: శ్రీ ఆంధ్ర కళా స్రవంతి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొరట్టూరు అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో శ్రీముఖ మండపం ఆవిష్కరణ ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. ప్రఖ్యాత హిందూ పురోహితులు ఆగమ శాస్త్ర ప్రకారం కుంభాభిషేకానికి సమానమైన గోపుర శిఖర కలశాభిషేకంతో శ్రీ ముఖ మండపం దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రముఖ చార్టెడ్ ఇంజనీర్ డాక్టర్ బి. ఎన్ గుప్తా, బి సరోజ దేవి కుటుంబ సభ్యులు డాక్టర్ బి రామ్ ప్రసాద్, పి సురేష్, పి విజయభాస్కర్, బి మాధవి, డాక్టర్ బి రేవతి (అమెరికా), డాక్టర్ బి రెడ్డి ప్రసాద్ (అమెరికా) ఆధ్వర్యంలో ఆలయ శిఖరం కలశం జల అభిషేకం, గోమాత పూజ, పూర్ణాహుతితో నవధాన్య హోమం, సీతారామ కళ్యాణం వైభవంగా జరిగాయి. శ్రీముఖ మండపాన్ని ఆస్కా మాజీ అధ్యక్షులు ఎం. ఆదిశేషయ్య ప్రారంభించారు.
ఇందులో పారిశ్రామికవేత్త కె అనిల్ కుమార్ రెడ్డి, అసోసియేషన్ అడ్వైజర్ ఎం.ఎస్ మూర్తి, ప్రెసిడెంట్ జెయం నాయుడు, సెక్రటరీ కె శ్రీనివాస్, ట్రెజరర్ జీవి రమణ తదితరులు పాల్గొన్నారు.
చివరిగా అన్న ప్రసాదాలను అందజేశారు. కుంభాభిషేకానికి హాజరుకాలేని పక్షంలో భక్తులు, 48 రోజుల మండల పూజకు హాజరై ఫలితాలను దక్కించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.