
చెన్నై న్యూస్: చెన్నై మహానగరంలోని విల్లివాకంలో ఉన్న శ్రీ కనకదుర్గ తెలుగు ప్రాథమిక పాఠశాల 79వ వార్షికోత్సవం మరియు స్పోర్ట్స్ డే శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. అనంతరం జరిగిన సభకు పాఠశాల అధ్యక్షులు ఆచార్య సి.ఎం.కే. రెడ్డి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా అజంతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ కె. శంకరరావు హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా సామాజిక కార్యకర్త బి. జవహర్ బాబు, లయన్ జె. జానక కోటయ్య, పాఠశాల వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ సి.ఎం. కిషోర్ పాల్గొన్నారు. బహుమతులను సామాజిక కార్యకర్త డాక్టర్ ఏ.వి. శివకుమారి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆచార్య సి.ఎం.కే. రెడ్డి మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ పాఠశాల అభివృద్ధి కోసం దివంగత డాక్టర్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నూతన కార్యవర్గం ఆధునిక ఆలోచనలతో పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి పరుస్తోందని అభినందించారు. తెలుగు భాషను పిల్లలకు నేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని, అప్పుడే మన భాషను పరిరక్షించగలమని చెప్పారు.
ముఖ్య అతిథి డాక్టర్ కె. శంకరరావు మాట్లాడుతూ తమిళనాడులో తెలుగు పాఠశాలలు కొనసాగడానికి ప్రధాన కారణం డాక్టర్ సి.ఎం.కే. రెడ్డి కృషి అని పేర్కొన్నారు. ఆయన కృషితోనే ప్రభుత్వం తెలుగు భాషను పాఠశాలల్లో కొనసాగిస్తున్నదని తెలిపారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా మంచి సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తారని, వాటిని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని కోరారు.
పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల ఆటపాటలతో కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నందగోపాల్, ప్రైమరీ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ నాగభూషణం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
……….