
చెన్నై న్యూస్:ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ ఫౌండర్ ,ప్రెసిడెంట్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఈ మేరకు ఆయన భారత ఎన్నికల సంఘానికి ఒక అధికారిక ప్రతినిధి పత్రాన్ని పంపించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల కారణంగా ముడి చమురు, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ ప్రభావం భారతదేశంపై కూడా పడుతూ ప్రజలు పెరుగుతున్న ధరలు, ఆర్థిక ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించడం ప్రజలపై మరియు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంపై అదనపు భారంగా మారే అవకాశం ఉందని అన్నారు.
త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తుత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు సంక్షేమమే ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రస్తుత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి ఎన్నికల షెడ్యూల్‌పై పునఃసమీక్ష చేయాలని ఆయన కోరారు.
……..