
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కడుపులో పిండంతో ఉన్న భార్యపై ఆమె భర్త రోడ్డుపైనే క్రూరంగా దాడికి దిగాడు. దీంతో ఆమె తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, హఫీజ్‌పేట ఆదిత్యనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ బసరత్ అనే వ్యక్తి ఇంటీరియర్ డిజైనింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. 2023లో అజ్‌మేర్ దర్గాను దర్శించేందుకు వెళ్లిన సమయంలో, బస్సు ప్రయాణంలో పశ్చిమ బెంగాల్‌కి చెందిన షబానా పర్వీన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, 2024 అక్టోబరులో బసరత్ కోల్‌కతాకు వెళ్లి ఆమెను వివాహమాడి హైదరాబాద్‌కి తీసుకొచ్చాడు.
పెళ్లి తరువాత పర్వీన్ ఒత్తిడి వల్ల బసరత్ తన తల్లిదండ్రుల్ని వదిలి ఆమెతో వేరు ఇంట్లో కాపురం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవలి కాలంలో పర్వీన్ గర్భవతిగా మారింది. రెండు నెలల గర్భంతో ఉండగా ఆమెకు తీవ్రమైన వాంతులు రావడంతో మార్చి 29న బసరత్ ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు.
ఏప్రిల్ 1న ఆరోగ్యం కొంత మెరుగవడంతో ఆమెను డిశ్చార్జి చేయించాడు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రి వెలుపల మరోసారి వాదన చెలరేగింది. ఆవేశానికి లోనైన బసరత్ ఆమెను రోడ్డుపై పడేసి పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకలతో తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పర్వీన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. ఆమె మరణించిందని అనుకుని బసరత్ అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలవల్ల ఆమె కోమాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.