న్యూఢిల్లీ ప్రతినిధి: లోక్‌సభలో “ఒకే దేశం, ఒకే ఎన్నికలు” బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్లమెంటు రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బ్యానర్లు పట్టుకుని, నినాదాలు చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, పదవీత్యాగం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో ఇండియా అలయన్స్ సభ్యులు, ప్రియాంక గాంధీ సహా అనేక మంది ఎంపీలు పాల్గొన్నారు. అమిత్ షా పార్లమెంట్‌కు చేరుకునే సమయంలో ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో అమిత్ షా కారు పార్లమెంట్ చుట్టూ రెండు సార్లు తిరిగినట్లు సమాచారం.
నిరసనల సమయంలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్‌పుత్ గాయపడగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తున్నారు.