
చెన్నై: హిందీ భాషపై తన వ్యాఖ్యలను తమిళనాడు అధికార పార్టీ నేతలు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను భాషా స్వాతంత్య్రానికి కట్టుబడి ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తాజాగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, భాషను బలవంతంగా రుద్దడానికీ, గుడ్డిగా వ్యతిరేకించడానికీ తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే, హిందీని వ్యతిరేకిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన తేల్చిచెప్పారు.
భాషా స్వేచ్ఛకే నా మద్దతు
2020 జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి విద్యార్థి తనకు నచ్చిన రెండు భారతీయ భాషలు, అదనంగా ఒక విదేశీ భాషను నేర్చుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నాడని పవన్ కల్యాణ్ తెలిపారు. హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని ఎక్కడా చెప్పలేదని ఆయన వివరించారు.
తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డ పవన్, తాను భాషా స్వాతంత్య్రం, విద్యా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. భాషలను రాజకీయ ఎజెండాగా మార్చకూడదని, విద్యా వ్యవస్థను రాజకీయల నుంచి దూరంగా ఉంచాలని సూచించారు.
“భాషల పరంగా ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి. హిందీ నేర్చుకోవాలనుకునే వారు నేర్చుకోవచ్చు, స్థానిక భాషలను అభ్యసించాలనుకునేవారికి కూడా అవకాశముంది. నేను రాజకీయ ఎజెండాలకు వ్యతిరేకం” అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
తమిళనాడు అధికార పార్టీ స్పందన
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేతలు, పవన్ వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. కేంద్రం భాషా పెత్తందారితనానికి తాము వ్యతిరేకమని, పవన్ కల్యాణ్ తమ వైఖరిని సమర్థించాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది.
…………..