
విల్లివాకం న్యూస్: సాహిత్యంలోను, సినీ సాహిత్యం లోను, మరోవైపు సినీ అనువాద సాహిత్యంలోను తనదైన శైలిలో ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకుని సినీ, టీవీ రంగుల ప్రపంచంలో నిండు పున్నమి వెలుగై నిలిచిన అగ్రశ్రేణి రచయిత వెన్నెలకంటి అని ఆచార్య విస్తాలి శంకరరావు కొనియాడారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక ప్రసంగ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. దీనికి ఆంధ్ర క్లబ్, కృష్ణా హాలు వేదికయింది. ఇందులో ‘వెన్నెలకంటి సాహిత్యం – సినీ వెన్నెల జలపాతం’ అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ అధ్యక్షులు, ఆచార్య విస్తాలి శంకరరావు ప్రసంగించారు. ముందుగా ఆయనను సంస్థ అధ్యక్షులు జెకె రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు సత్కరించారు. విస్తాలి శంకరరావు మాట్లాడుతూ
వెన్నెలకంటి అంటే సినీ సాహిత్యానికి ఒక ఎన్సైక్లోపీడియా, ఒక విజ్ఞాన సర్వస్వం, ఒక చమత్కారం, ఒక స్నేహం, ఒక అనువాద విజ్ఞానం అన్నారు. వెన్నెలకంటి 1957 నవంబర్ 30 వ తేదీన వెన్నెలకంటి పద్మావతమ్మ, వెన్నెలకంటి కోటేశ్వరరావు దంపతులకు నెల్లూరులో జన్మించారని,
వీరి జీవన నేపధ్యం, పరిసరాలు వీరిని విశిష్టత కలిగిన కవిలా ఎదిగేలా చేశాయన్నారు.
సాహిత్యంలోను, వ్యాకరణంలోను, భారత, రామాయణ, భాగవతాలలోను, వివిధ భాషల విజ్ఞానంలోను మంచి పట్టు ఉండడంతో అనతి కాలంలోనే అగ్రస్థానంలో నిలిచారని, వారిని
అనేక పురస్కారాలు వరించాయని తెలిపారు. సాహితీ, సినీ సాహితీ లోకంలో ‘గడ్డం లేని ఋషి ‘ గా, ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ గా, ‘డబ్బింగ్ కింగ్’ గా కీర్తిని ఆర్జించారని పేర్కొన్నారు.
ఇక వారు సినీ సాహిత్యంలో ప్రదర్శించిన సాహితీ విన్యాసాలను అనేక పాటలు ద్వారా వివరిస్తూ, ఆ పాటల సృష్టిలోని దర్శకులు, నిర్మాత లు, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల నేపథ్యాలను విపులంగా వివరించారు.
వారి సాహిత్యం లోగల జోల పాటలు, భక్తి పాటలు, ప్రేమ గీతాలు, విషాద గీతాలు, సామాజిక చైతన్య గీతాలు, డబ్బింగ్ పాటలు పాడుతూ అందులోని దాగి ఉన్న భావాలు, రచనా విశేషాలు, చమత్కారాలు తెలియజేయడమే కాక తొలి తరం, మలితరం సినీ కవులకు అనుసంధాన కర్తగా వ్యవహరించన తీరును విశ్లేషించారు.
తన సినీ ప్రస్థానంలో కుటుంబ సభ్యులతో పాటు ఎదిగేందుకు ఎందరో దోహద పడ్డారని, ముఖ్యంగా గానగంధర్వులు బాలు గారి ప్రోత్సాహం మరువలేనిదని తాను తినే బియ్యపు గింజ పై బాలు గారి పేరు ఉంటుందని వెన్నెలకంటి భావించారని, అలాగే వారి స్నేహితులు గిరీశం, సుబ్బారావు గార్ల సహకారం ఎంతో ఉందని వ్యక్తం చేశారు.
వారి పేరు లో ఉన్న ‘వెన్నెల’ ను సాహిత్యంలోకి నింపి జలపాతం లా పరుగులు తీయించిన సాహితీ స్రష్ట అని వారి సాహితీ వెన్నెల జలపాత సౌందర్యాలను వివరించి శ్రోతలను అలరించారు. ఈ కార్యక్రమంలో ఆస్కా నూతన అధ్యక్షులు జి శశిధర్ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి సహా నగర ప్రముఖులు పాల్గొన్నారు.
……………