
చెన్నై, న్యూస్:ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ–20) వినియోగం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వతంత్ర సాంకేతిక విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు.
ఈ మేరకు ఆయన భారత ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించడంతో పాటు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థకు అధికారిక ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం, స్టార్ట్ సమస్యలు తలెత్తడం, నిర్వహణ వ్యయం పెరగడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ విజ్ఞప్తి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడానికి కాదని, కోట్లాది మంది వాహనదారుల ప్రయోజనాల దృష్ట్యా స్వతంత్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలనే ఉద్దేశంతోనే చేసినదని ఆయన స్పష్టం చేశారు.
సమర్పించిన ఫిర్యాదులకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థలో 9641306 డాకెట్ సంఖ్య, ప్రధానమంత్రి ప్రజా ఫిర్యాదు విభాగంలో PMOPG/E/2026/0120564 నమోదు సంఖ్య కేటాయించినట్లు తెలిపారు.
వాహన తయారీ సంస్థలు, చమురు సంస్థలు, వినియోగదారుల సంఘాలు, స్వతంత్ర సాంకేతిక నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం నిర్వహించి, దాని నివేదికను ప్రజలకు వెల్లడించాలని తమిళనాడు తెలుగు యువశక్తి డిమాండ్ చేసింది.
దేశ అభివృద్ధితో పాటు వినియోగదారుల హక్కులకు కూడా సమాన ప్రాధాన్యం కల్పించాలని, కోట్లాది మంది వాహనదారులను ప్రభావితం చేసే నిర్ణయాలు శాస్త్రీయ ఆధారాలు, పూర్తి పారదర్శకతతో అమలు కావాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు.
ఈ అంశంపై రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన మార్గాల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రకటించింది.