
విశాఖ న్యూస్:‘‘యోగా… ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’’ అనే థీమ్‌తో విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని దేశ మట్టిలోని యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ,
‘‘ప్రపంచ యోగా దినోత్సవం భారతదేశానికి దక్కిన అపూర్వ గౌరవం. రుగ్వేదం కాలంనుండే యోగా విశిష్టతను భారతీయులు పాటిస్తూ వచ్చారు. అయితే, దానిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిదే’’ అన్నారు.
యోగా మన సనాతన ధర్మానికి చెందిన అనంత సంపదగా పేర్కొంటూ,
‘‘శరీర, మానసిక సమతుల్యతను అందించే ఆధ్యాత్మిక సాధన యోగా. ఆది యోగి పరమ శివుడు దీని మూలం అయితే, పతంజలి మహర్షి దీనిని శాస్త్రీయంగా సమర్పించారు’’ అని అన్నారు.
గౌరవ ప్రధాని శ్రీ మోదీ గారి పిలుపుతో ప్రపంచ దేశాలు యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకుంటున్నాయని, 177 దేశాలు ఆయన ప్రతిపాదనకు మద్దతు తెలిపినదే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.
ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారని, ఇది ప్రపంచ రికార్డు స్థాయిలో నమోదైందని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.

