
విల్లివాకం న్యూస్: భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారత్ అని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వెల్లడించారు. అఖిల భారత తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు (సోమవారం) సాయంత్రం చెన్నై, రాజ్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఇందులో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి విచ్చేశారు. ఇందులో సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ సిఎంకే రెడ్డి, గొల్లపల్లి ఇశ్రాయేలు, సీఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఇందులో వివిధ రాష్ట్రాల ఫౌండేషన్ డే వేడుకలు చోటు చేసుకున్నాయి. ఇందులో డాక్టర్ వై విజయ చంద్ర రెడ్డి, సుర్జిత్ ముంజర్ సింగ్ నాయక్, బిజేంద్ర సింగ్ తో పాటు వివిధ రాష్ట్రాల కు చెందిన ప్రతినిధులు తమిళనాడుతో తమ అనుబంధాన్ని, అభిప్రాయాలను పంచుకున్నారు. వీరంతా ముందుగా గవర్నర్ రవిని సత్కరించారు. అనంతరం గవర్నర్ ప్రొఫెసర్ సీఎం కే రెడ్డి తో సహా పలువురిని సత్కరించారు. ఇందులో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగిస్తూ ప్రస్తుత వేడుకలలో తొమ్మిది రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నట్లు తెలిపారు. గతంలో రాష్ట్రాల మాత్రమే ఈ వేడుకలను జరుపుకునేవని, ప్రస్తుతం వినూత్న రీతిలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల ప్రజలకు వారి సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. తమిళనాడులో వివిధ భాషల ప్రజలు మమేకమై తమిళ ప్రజలతో జీవిస్తున్నట్లు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా భారత్ పేరు గడిచిందని అన్నారు. నేటి రాజకీయాలు సమాజాన్ని విడదీస్తున్నాయని, ఇందుకు వీలు కల్పించరాదని అన్నారు. భారత్ వంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదని తెలిపారు. ప్రజలంతా ఐక్యమత్యంగా కలసి మెలసి ఒకే కుటుంబంలో జీవించాలని పేర్కొన్నారు. మన సంస్కృతులను బట్టి మనం గర్వపడాలని అన్నారు. చివరిగా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి నగరంలోని తెలుగు ప్రముఖులు పలువురు హాజరయ్యారు.
……………