
కెసిఆర్‌ను అరెస్ట్ చేయడంలో విూనమేషాలు
కొత్త రేషన్ కార్డుల హావిూ ఏమయ్యింది
రాజీనామా చేస్తేనే ఎమ్మెల్యేలను చేర్చుకుంటాం
నిరుద్యోగులపై మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ
విూడియా సమావేశంలో ఎంపి రఘునందన్ విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయటానికి రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతోందని మెదక్ ఎంపీ రఘనందనరావు ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన సంబంధిత
మంత్రులను అరెస్ట్ చేయటానికి విూనమేషాలు లెక్కిస్తోందని విమర్శలు చేశారు. ఏడు నెలల్లో.. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల హావిూ మేరకు వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘనందనరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడు నెలల్లో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది తప్ప.. పాలనలో మార్పు కనిపించంలేదని విమర్శించారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కు బుద్ది చెబుతామని హెచ్చరించారు. పదవికి రాజీనామా చేస్తేనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ను బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీలో చేరటానికి చాలా మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో విూడియాతో రఘునందన్ మాట్లాడుతూ… ఉప ఎన్నికకు సిద్ధంగా ఉంటేనే చేర్చుకుంటామని టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పామని అన్నారు.
రుణమాఫీ, రైతు భరోసా కోసం పోరాటం చేయాలని కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించామని అన్నారు. నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని నిర్ణయించామని చెప్పారు. నిరుద్యోగులపై ప్రతిపక్షంలో ఒకమాట.. అధికారంలో వచ్చాక మరోమాట కాంగ్రెస్ మాట్లాడుతోందని చెప్పుకొచ్చారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తోందని చెప్పారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతికి రూ.4,116 లేవు కానీ.. సీఎం రేవంత్ రూ. 4 లక్షలు నెల జీతం తీసుకుంటున్నాడని చెప్పారు. దేశంలో ఎక్కువ నెల జీతం రేవంత్ తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని ఎంపీ రఘనందనరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతోందని భాజపా ఎంపీ విమర్శించారు. గ్రూప్1 పోస్టులు తక్కువ ఇచ్చారని గతంలో కాంగ్రెస్ చెప్పిందని.. అధికారంలోకి వచ్చాక కేవలం 60 పోస్టులు మాత్రమే పెంచిందని అన్నారు. చదువుకున్న వారికే పోటీ పరీక్షల విలువ తెలుస్తుందని, ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య 30 రోజుల కాల వ్యవధి ఉండాలని డిమాండ్ చేశారు. రూ.లక్షల జీతం తీసుకునే రేవంత్‌రెడ్డి వద్ద నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. కుల, జన గణన ఏమైందని రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే బయటకు తీస్తే 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. పంచాయతీ, ఎంపీటీసీ పదవీకాలం ముగిసి నెలలు గడుస్తున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదని మండిపడ్డారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.