విల్లివాకం న్యూస్: ఒక భాష ఉనికి కోల్పోతే, దానికి మూలమైన సంస్కృతి, సంప్రదాయాలు, మనుగడ అంతా కోల్పోయే ప్రమాదముందని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కె.అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.
గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని స్థానిక మైలాపూర్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక బృందం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్మారక భవనాన్ని సందర్శించి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారన్నారు. ఆయనకు భవన నిర్వాహక బృందం ఎదుర్కొంటున్న సమస్యలు, కమిటీ తరఫున కొన్ని కోర్కెలను తెలియజేశామన్నారు.
భవన నిర్వహణకు, అవసరమైన నిధుల గురించి, అలాగే గ్రంథాలయం విస్తరణ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ , మంత్రి ఎన్ లోకేష్ లతో మాట్లాడి పరిష్కరింప చేస్తానని బుద్ధ ప్రసాద్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు మంచి శుభవార్త అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు గ్రాంథిక భాషను అందరికీ అర్థమయ్యేలా వ్యవహారిక భాషగా మార్చి సాహితీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. యువతలో మాతృభాషను కాపాడుకోవాలన్న తపన కనిపించడం లేదని, ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషను అందరూ కాపాడుకోవాలని సూచించారు. తమ కమిటీ తరఫున భవిష్యత్తులో మరిన్ని తెలుగు కార్యక్రమాలను జరుపుకునేందుకు వీలుగా కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య ను సాంస్కృతిక కార్యదర్శిగా నియమించినట్లు అనిల్ కుమార్ రెడ్డి సభలో ప్రకటించారు. సభ్యులు జె ఎం నాయుడు స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా విశ్రాంత ఆచార్యులు డాక్టర్ నిర్మల పళనివేలు పాల్గొని గిడుగు రామమూర్తి తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. ఆకాశవాణి చెన్నై కేంద్రం విశ్రాంత ఉద్గోషకురాలు బిట్రా గజగౌరి కీలక ప్రసంగం చేశారు. తెలుగు భాష ఖ్యాతి, గిడుగు రామమూర్తి సేవల గురించి సుదీర్ఘంగా ప్రసంగించి ఆకట్టుకున్నారు. ప్రార్థన గీతాన్ని నిడమర్తి వసుంధరా దేవి ఆలపించారు. ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు డాక్టర్ ఏవి శివకుమారి వ్యాఖ్యాతగా వ్యవహరించగా గుడిమెట్ల చెన్నయ్య వందన సమర్పణ చేశారు. డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా, పలువురు తెలుగు సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
……………