
*పారిశ్రామికాభివృద్దికి విదేశీ సహకారంతో ప్రభుత్వం అడుగులు
*చెన్నైలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు
చెన్నై న్యూస్ :ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం చెన్నైలోని హిల్టన్ హోటల్ లో జరిగిన ఇండో – జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తరుపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఇండో – జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలసికట్టుగా ఏపీలో ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకానికి గానూ జర్మన్ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన నిపుణులు రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు గానూ, లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా రాష్ట్రం తరుపున హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల్లో ప్రమాణాలను మెరుగు పరిచేందుకు, యువ పారిశ్రామిక వేత్తలకు, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్ ల అభివృద్ధి, ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు జర్మనీ సహకారం తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఇండో-జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క 59వ వార్షిక రీజియనల్ మీట్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది జర్మన్ కంపెనీల సీఈఓలు, సిఎఫ్ఓలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈఓ శ్రీ విశ్వ మనోహర్, తదితర అధికారులు హాజరయ్యారు.
……………….