
డా. డైట్, డా. ఎక్సర్సైజ్, డా. పాజిటివ్, డా. టేకిట్ ఈజీ అనే నలుగురు డాక్టర్లను కలిస్తే ఇక జీవితంలో మరే డాక్టర్ని కలవాల్సిన పని లేదని ఆచార్య సీఎంకే రెడ్డి అభిప్రాయపడ్డారు. పట్టాభిరాంలో ఉన్న డి ఆర్బిసీసీసీ హిందూ కళాశాల, తెలుగుశాఖ, తెలుగు భాషా సమితి నిర్వహించిన ఉగాది వేడుకలు, సమాపన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య సీఎంకే రెడ్డి విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఉపాధ్యాయ, వైద్య వృత్తులు రెండూ ఉన్నతమైన వృత్తులనీ, అందులోనూ వైద్య విద్య అంత సులభమైనది కాదని వ్యాఖ్యానించారు.
వృత్తి రీత్యా ఎన్నో రకాల రోగులను చూస్తుంటానని అనేక రోగాలు మానసికంగా కొని తెచ్చుకుంటున్నారని దానికి కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచిస్తూ ఆత్మ విశ్వాసం, పాజిటివ్ థింకింగ్, సంభాషణా నైపుణ్యం, డిప్లమసీ లాంటివి పెంపొందించుకుంటే జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితిలను నెగ్గుకుని పోవచ్చని అన్నారు. విద్యార్థులు కేవలం అకడమిక్ నైపుణ్యాన్ని నేర్చుకుంటే సరిపోదని, వారికి ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలను కూడా తరగతుల్లో నేర్పించాలని అధ్యాపకులకు సూచించారు. తాను వైద్య అధ్యాపకుడిగా ఇలాంటివి అనేక విషయాలను విద్యార్థులకు నేర్పిస్తుంటానని అన్నారు.
తెలుగు భాష కోసమే కాదు అన్ని మైనారిటీ భాషల కోసం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి పోరాడి గెలిచాను కానీ తెలుగు వారు తెలుగు పిల్లల్ని నిర్బంధ తమిళంతో పాటూ తెలుగును కూడా ఒక సబ్జెక్టుగా తీసుకుని చదువుకుంటేనే తెలుగు నిలబడుతుందని సూచన చేశారు. కృష్ణదేవరాయల కాలంలో సాధారణ పౌరులు కూడా తెలుగు పాండిత్యంతో ఉండేవారని ఒక బాటసారి సున్నం కోసం ఒక గృహిణి ఇంటికి వెళ్లి అడిగితే ఆవిడ పద్యం పాడి మరీ సున్నం ఇచ్చిందని అర్థంతో పాటూ ఆ పద్యం చెప్పి విద్యార్థులను, అధ్యాపకులను ఆకట్టుకున్నారు. ప్రసంగం ఆసాంతం విద్యార్థులు, తెలుగుతో పాటూ ఇతర శాఖల అధ్యాపకులందరూ ఎంతో ఆసక్తిగా విన్నారు.
ఘనంగా సాగిన ఉగాది వేడుకలు కార్యక్రమానికి శాఖాద్యక్షుడు డా. సురేశ్ స్వాగతం పలుకగా, ప్రధాన అధ్యాపకులు డా కల్విక్కరసి ప్రసంగించి ముఖ్య అతిథినీ సత్కరించారు. కళాశాల రెండు విభాగాల్లో పదవీ విరమణ చేస్తున్న వివిధ శాఖలకు చెందిన నలుగురు అధ్యాపకులను ముఖ్య అతిథి డా. సిఎంకే రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపికలను బహూకరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా క్షణోత్తరి, పాటల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతి ప్రదానం చేసారు. ముఖ్య అతిథిని డా. తుమ్మపూడి కల్పన పరిచయం చేయగా, డా ప్రమీల వందన సమర్పణ చేశారు. కార్యక్రమాన్ని ముందుగా అశ్విని, బాబుల తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. సభా నిర్వహణ తెలుగు విద్యార్థి బాబు, వర్తక శాఖ విద్యార్థి ఝాన్సీలు నిర్వహించారు.
…………….