
టీ నగర్ న్యూస్:తమిళనాడులోని ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీర్తెపట్టి గ్రామంలో ఒక హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి తన ప్రేమికుడితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర పన్నింది. భర్త వీరికి అడ్డొస్తున్నాడన్న ఆవేశంతో, అతనికి ఐదుసార్లు విషం కలిపిన సాంబారును ఇచ్చింది. చివరికి భర్త మృతి చెందగా, విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
లారీ డ్రైవర్ రసూల్ (43)కు భార్య అమ్ముబి (35), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు పక్కింటి సెలూన్ యజమాని లోకేశ్వరన్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. భర్త ఇది గమనించి వారిపై రగిలిపోయాడు. దీనికి ప్రతీకారంగా అమ్ముబి, లోకేశ్వరన్ కలిసి అతన్ని తొలగించే కుట్ర చేశారు.
లోకేశ్వరన్ అందించిన పురుగుల మందును, అమ్ముబి ఐదుసార్లు భర్తకు వండిన సాంబారులో కలిపి ఇచ్చింది. అయితే పిల్లలు ఆ భోజనం తినకపోవడం వల్ల వారు ప్రాణాలతో బయటపడ్డారు. రసూల్ అస్వస్థతకు గురవగా, ఆస్పత్రిలో పరీక్షలలో విషమించిందని తేలింది.
సందేహంతో భార్య ఫోన్ తనిఖీ చేయగా, లోకేశ్వరన్‌తో ఉన్న చాటింగ్, ఆడియోలు, వీడియోలు బయటపడ్డాయి. వాటిల్లో అమ్ముబి, భర్తకు ఎలా విషం కలిపిందో చెప్పిన సంభాషణ ఉంది. చివరికి రసూల్ పరిస్థితి విషమించి చెన్నైలో చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబి, లోకేశ్వరన్లను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.