
మెయిన్ రోడ్ వెనుక వీధుల్లో నష్టపోతున్న రేట్ పేయర్లు – ఇంటిపన్నులు నియంత్రిస్తామన్న ఎన్.డి.ఎ హమీ అమలుచేయాలి
పౌర సంక్షేమ సంఘం విజ్ఞప్తి
కాకినాడ, జూలై 11 : ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపులో భూముల రిజిస్ట్రేషన్ రేట్లు అసమంజసంగా వుండడం వలన రేట్ పేయర్లు తీవ్రంగా నష్టపోతున్నారని పౌర సంక్షేమ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మెయిన్ రోడ్ లో చదరపు గజం భూమి ప్రభుత్వ రిజిస్ట్రే షన్ ధర రు.95 వేలు వుండగా అదే ధరను మెయిన్ రోడ్ ను ఆనుకుని వెనుక వైపు వున్న వీధుల్లో కూడా అదే ధర నిర్ణయం చేయడం వలన ఆస్తి పన్ను విధింపు దారుణంగా తయారయ్యిందన్నారు. వంద అడుగుల వెడల్పువున్న ప్రధాన రహదారిగా వున్న మెయిన్ రోడ్డుకు 40 అడుగులు వెడల్పువున్న చిన్నపాటి వీధి రోడ్లకు ఒకే ధర నిర్ణయం చేయడం తగదన్నారు. టుటౌన్ నుండి జగన్నాధపురం వంతెన వరకు రెండు వైపులా వున్న సూర్యారావుపేటలోని మాదిరెడ్డి వారి వీధి, లచ్చిరాజు వారి వీధి, మునసబు గారి వీధి, దంటువారి వీధి, తటవర్తి వారివీధి, సాలిపేటలోని కాసిం వీధి, ఇంధన వారి వీధి, ఇమంది వారి వీధి, పైడా వారి వీధి, గాజుల వారి వీధి, దేవాలయం వీధి, సినిమారోడ్ నడుమవున్న లోపలి వీధులలో చిన్నసందులకు కూడా మెయిన్ రోడ్ భూమికి చెందిన రిజి స్ట్రేషన్ ధర విధించడం తగదన్నారు. ఆస్తి విలువను ఇష్టారాజ్యం చేసి ఆస్తి విలువ మీద ఇంటి పన్నులు నిర్ణయం చేయడం రేట్ పేయర్లు నష్టపోతున్నారన్నారు. ఏడాదికి 15శాతం వంతున ప్రతి ఏటా పెంచడం వలన ఆర్థిక నష్టం కలుగుతోందన్నారు. మూడేళ్లలో పెంచిన పన్ను మీద ఏటా పెరుగుతున్న కారణంగా 60 శాతం భారం అయ్యిందన్నారు. గతంలో అయిదేళ్లకోసారి ఇంటిపన్నుపెంచే ప్రక్రియ అమలులో వుండగా ఇప్పుడు ఏడాదికి ఒకసారి 15 శాతం పెంపుతో ఇంటి పన్ను నోటీసులు వస్తున్నాయన్నారు. రిజిస్ట్రేష న్ భూమిరేట్లలో మెయిన్ రోడ్ రేటుకు లోపలి వీధులకు వ్యత్యాసం చూపించాల్సిన అవసరం వుందన్నారు. ఇందుకు తగిన మార్పులు సవరణలు చేయాలన్నారు. ఇందువలన ఇంటి పన్ను విధింపులో 25 శాతం భారం తగ్గుతుందనారు. ఎన్.డి.ఎ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటిం చిన హమీ ప్రకారం ఇంటి పన్నుల విధింపును నియంత్రణ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇంటి పన్నులను అయిదేళ్లకు ఒకసారి పెంపు చేసే విధానం అమలు చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు డిమాండ్ చేశారు. లేకుంటే నగరాలు, పట్టణాల్లో మధ్య తరగతి కుటుంబాలు ఏటా పెరుగుతున్న ఇంటిపన్నులు చెల్లించలేక పూర్వీకుల ఆస్తిగా వున్న ఇళ్లు కూల గొట్టుకోలేక ఆస్తులు అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందన్నారు. ఆస్తి విలువ ఆధారిత పన్నుల విధానాన్ని ప్రతిపక్షంగా వ్యతిరేకించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలో వున్నందున రాష్ట్ర రేట్ పేయర్ల సంఘాలతో సమీక్షించి మున్సిపాలిటీ ఇంటిపన్నులు నియంత్రణ చేయాలని కోరారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులతో తగిన కార్యాచరణ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.