టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, తాను మంచి స్నేహితులమని భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తెలిపారు. కోహ్లీలోని మరో కోణం చాలా మందికి తెలియదన్నారు. తామిమిద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చాం అని, ఒకే లాంటి కలలు కన్నాం అని పేర్కొన్నారు. ప్రతీ విషయం గురించి తాము మాట్లాడుకుంటామని ఛెత్రీ చెప్పారు. ఫుట్‌బాల్‌కు ఛెత్రీ ఇటీవలే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోహ్లీ కూడా టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ సందర్భంగా తన స్నేహితుడు విరాట్ గురించి ఛెత్రీ ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. యూట్యూబ్ రాజ్ షమణి పోడ్‌కాస్ట్‌లో సునీల్ ఛెత్రీ మాట్లాడుతూ%ౌ% ‘విరాట్ కోహ్లీ అద్భుతమైన వ్యక్తి. చాలా మందికి అతడిలోని మరో కోణం తెలియదు. విరాట్ చాలా ఫన్నీగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం. విరాట్, నేను ఒకే ప్లేస్ నుంచి వచ్చాం. ఒకేలాంటి కలలు కన్నాం. విభిన్న గేమ్‌లను ఎంచుకున్నప్పటికీ.. మా భావం మాత్రం ఒక్కటే. కోహ్లీపై నాకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదు. అతడితో చాటింగ్ చేస్తుంటే ఎక్కువగా ఫన్నీ మీమ్స్‌ను పంపుతుంటాడు. ప్రతీ విషయం గురించి మేం మాట్లాడుకుంటాం’ అని చెప్పారు. జూన్ 6న కువైట్‌తో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్ అనంతరం సునీల్ ఛెత్రీ రిటైర్ అయ్యారు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్ట్రైకర్.. 94 గోల్స్ కొట్టారు. దేశం తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కెరీర్‌ను ముగించారు. భారత్ మూడు సార్లు (2007, 2009, 2012) నెహ్రూ కప్, మూడు సార్లు (2011, 2015, 2021) సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) ఛాంపియన్‌షిప్ గెలవడంలో ఛెత్రి కీలక పాత్ర పోషించారు. 2008 ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా.