
తెలుగుజాతి గర్వించదగ్గ అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని బుధవారం ఉదయం పెరంబూరులో ఘనంగా నిర్వహించారు. చెన్నై పెరంబూరులోని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, గాయకుడు కిడాంబి లక్ష్మి కాంత్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తమ్మినేని బాబు మాట్లాడుతూ, తెలుగుజాతి గర్వించదగ్గ మహాగాయకుడు ఘంటసాల అని, సంగీతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
లక్ష్మి కాంత్ మాట్లాడుతూ, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం, జనని సంస్థలు ప్రతి ఏడాది ఘంటసాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఘంటసాల పై తనకు ఎంతో అభిమానం ఉందని, తెలుగువారిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు.ఘంటసాల పాడిన భగవద్గీత పద్యాలు పాడి వినిపించారు.
జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ, ఘంటసాల ఎన్నో ఆధ్యాత్మిక, సాంఘిక, పౌరాణిక, విషాద గీతాలను మధురంగా ఆలపించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయనను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం. కొండయ్య, వి. సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
………