
విల్లివాకం న్యూస్:తెలుగు సాహితీ ప్రియులకు మేలు మేళవిన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతూ, వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ‘తరతరాల తెలుగు కవిత’ ఉపన్యాస ధారావాహికలో 160వ ఎపిసోడ్ అద్భుతంగా ఆవిష్కృతమైంది.
ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు చెన్నై టీ.నగర్‌లోని విజయ రాఘవ రోడ్డుపై ఉన్న ఆంధ్రా క్లబ్, కృష్ణా హాలులో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి, పరిశోధకురాలు డా. ప్రభల జానకి ‘హరికథాలహరి – నిత్య నూతన సుధా మాధురి’ అనే అంశంపై ఆలోచనాత్మకంగా ప్రసంగించారు.
ఆధ్యాత్మికత, సాహిత్యం, సంగీతం మేళవించిన హరికథల ప్రాచీనత, ప్రాముఖ్యత, వాటి ఆధునిక ప్రాసంగికతను ఆమె తన ప్రసంగంలో విశ్లేషించారు. కథా శైలిలో సుదీర్ఘ అనుభవంతో పాటు పరిశోధనా లోతులు కలగలిపిన డా. జానకి ఉపన్యాసం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
కార్యక్రమంలో వేదిక అధ్యక్షులు జెకె రెడ్డి, కార్యదర్శి కందనూరు, డా. జానకిని శాలువాతో కప్పి, జ్ఞాపికతో సత్కరించి సన్మానించారు. నగరంలోని పలువురు సాహిత్యాభిలాషులు, తెలుగు సాంస్కృతిక ప్రముఖులు కార్యక్రమానికి హాజరై, సాహితీ సమాలోచనలో భాగస్వాములయ్యారు.
………….