దశదిశ లేదన్న మాజీమంత్రి వేముల
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పసలేనిదిగా ఉందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వ మొదటి బడ్జెట్ దశ దిశ లేకుండా ఉందని, ఇది తిరోగమన దిశలో నడిపే బడ్జెట్ అని అభివర్ణించారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా విమర్శించడం సరికాదన్నారు. పదేళ్లలో అన్నిరంగాలను అభివృద్ది చేసిన గనత కెసిఆర్‌దని అన్నారు. ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాల ప్రస్తావనే లేదని, ఆరుగ్యారంటీలను పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని నిందించారని, భట్టి 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారని.. చెప్పారు. మహాలక్ష్మి పథకంపై బడ్జెట్ మహా నిరాశ కలిగించిందని, కోటి మంది మహిళలు నెలకు రూ. 2500 కోసం ఎదురుచూస్తున్నారని, ఎనిమిది నెలల్లో మహిళలకు రూ.20వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడ్డదని చెప్పారు. ఆసరా పింఛను రూ. 4 వేలు ఇస్తామని బాండు పేపర్ విూద రాశారని, మరి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, స్కూటీలు ఇస్తామన్నారని వాటి ప్రస్తావన ఏదని నిలదీశారు. కొత్త రేషన్ కార్డులు, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదని మండిపడ్డారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని, చేనేత కార్మికులకు గుండు సున్నా చూపారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపోతే రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తక్కువ మందికి రుణమాఫీ చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది రైతులకు లబ్ది చేకూరినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం 94వేల 566 మంది రైతులకు రూ.459 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. రైతు సంక్షేమం కోసం ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు తలపెట్టని కార్యక్రమాలను కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. 60 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు వానకాలం సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.7500 చొప్పున రైతుభరోసా ఇవ్వాల్సి ఉండగా రూ.11,250 కోట్లు ఎగ్గొట్టి ఆ డబ్బులతో రుణమాఫీ కింద రూ.6098 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఏదో ఘనకార్యం చేసినట్లుగా గోబెల్స్ ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ మోసానికి రైతులు సంబురాలు చేసుకోవాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం రుణమాఫీని 37లక్షల మంది రైతులకు వర్తింపజేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు, లోన్ రీషెడ్యూల్, ఆదాయ పన్ను పేరిట కొర్రీలు పెట్టి 26లక్షల మంది రైతులను ఏరి పారేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు కేవలం 11లక్షల మంది రైతులకు కుదించి రుణమాఫీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు చేసుకునే రైతు కుటుంబాలు, చిన్న వ్యాపారాలు చేసుకునే రైతులకు కూడా రుణమాఫీ అమలు చేయాలని వేముల డిమాండ్ చేశారు