
మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ఆహారం, వ్యాయామం, మందులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ, రాత్రంతా ఏమీ తినకపోయినా ఉదయాన్నే ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా కనిపించడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘డాన్ ఎఫెక్ట్’ అని పిలుస్తారు. ఈ సమస్యను కేవలం ఆహారం మార్చడం ద్వారా మాత్రమే నియంత్రించడం సాధ్యం కాదని, ఉదయాన్నే మనం పాటించే అలవాట్లే ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్ నిపుణుడు డాక్టర్ మోహిత్ శర్మ వెల్లడించారు.
డాన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి?
తెల్లవారుజామున మన శరీరం సహజంగా కార్టిసాల్, అడ్రినలిన్, గ్లూకాగాన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి శరీరానికి శక్తిని అందించేందుకు కాలేయం నుంచి గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తాయి. సాధారణ వ్యక్తుల్లో ఇన్సులిన్ దీనిని సమతుల్యం చేస్తుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సరైనంగా పనిచేయకపోవడంతో షుగర్ స్థాయిలు పెరుగుతాయి.
నిద్రలేవగానే టెన్షన్ వద్దు
ఉదయం లేవగానే ఫోన్ చూడడం, ఆఫీస్ పనుల గురించి ఆలోచించడం వంటి అలవాట్లు ఒత్తిడిని పెంచుతాయి. దీని వల్ల చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లేచిన వెంటనే 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, లోతుగా శ్వాస తీసుకోవడం మేలు చేస్తుంది.
నీరు తాగడం మొదటి పని కావాలి
రాత్రి నిద్రలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా కనిపిస్తుంది. నిద్రలేచిన వెంటనే 1–2 గ్లాసుల సాధారణ నీరు తాగడం వల్ల కిడ్నీలు గ్లూకోజ్‌ను సరిగ్గా వడపోసేందుకు సహాయపడతాయి.
తేలికపాటి కదలికలు చాలాయి
ఖాళీ కడుపుతో తీవ్రమైన వ్యాయామాలు చేయడం శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. బదులుగా అల్పాహారానికి ముందు 10–15 నిమిషాలు నడక, సాగదీత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి.
ఉదయపు ఎండ అవసరం
ఉదయాన్నే కొన్ని నిమిషాలు సూర్యరశ్మిలో ఉండటం శరీరంలోని జీవగడియారాన్ని సరిచేస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడి షుగర్ నియంత్రణకు తోడ్పడుతుంది.
ఖాళీ కడుపుతో టీ–కాఫీ వద్దు
ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే అడ్రినలిన్ హార్మోన్ విడుదలై షుగర్ అకస్మాత్తుగా పెరుగుతుంది. కాబట్టి టీ లేదా కాఫీ తాగాలనుకుంటే అల్పాహారం తర్వాత లేదా నీరు తాగిన అనంతరం తీసుకోవడం మంచిది.
ప్రోటీన్‌తో కూడిన అల్పాహారం
ఉదయపు భోజనంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువైతే షుగర్ వేగంగా పెరుగుతుంది. గుడ్లు, పెరుగు, పనీర్, మొలకలు, బాదం వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ అనేది అల్పాహారంతో కాదు… మీరు కళ్లు తెరిచిన మొదటి నిమిషంతోనే ప్రారంభమవుతుందని డాక్టర్ మోహిత్ శర్మ తెలిపారు. ఇవి మందులకు ప్రత్యామ్నాయం కాకపోయినా, మందుల ప్రభావాన్ని మరింత పెంచుతాయని సూచించారు.
……….