
విళ్లివాకం న్యూస్: తెలుగు పదాల సంపదే మన సిరిసంపదలని యూఎస్ఏ (డాలస్ టెక్సాస్) శంకర నేత్రాలయ పాలక మండలి సభ్యుడు డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి తెలిపారు. ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్, చెన్నై ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా జరిగాయి. దీనికి స్థానిక మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్మాహక కమిటీ అధ్యక్షులు కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి, విశిష్ట గౌరవ అతిథిగా విచ్చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.వి నారాయణ గుప్తా వేదిక అలంకరించారు. ముందుగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శివకుమారి సేవ చేయాలనే సంకల్పంతో తల్లిదండ్రుల పేరిట ట్రస్ట్ ప్రారంభించినట్లు తెలిపారు. వారి సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని కోరారు. నారాయణ గుప్తా మాట్లాడుతూ సేవా దృక్పధంతో శివకుమారి ఈ ట్రస్టును ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జానపద గీతాల పోటీలలో విజేతలుగా నిలిచిన సీనియర్ విద్యార్థులు ఎం స్ఫూర్తి, నందిని, నాగలక్ష్మి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. జూనియర్స్ లో జి.హార్దిక వర్షిణి, రాకేష్ బహుమతులు అందుకున్నారు. సబ్ జూనియర్స్ లో జస్వంత్ కుమార్, కీర్తిని, మణిదీప బహుమతులు అందుకున్నారు. ఇందులో డాక్టర్ మాదా శంకర్ బాబు మోక్ష శ్రీ (సాహిత్య వ్యాసాలు) పుస్తకాన్ని ముఖ్య అతిథి డాక్టర్ నరసింహారెడ్డి ఊరుమిండి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన మాతృభాష తెలుగులో పదాల సంపద ఎంతో ఉందని, అవి మన తెలుగు సిరిసంపదలని పేర్కొన్నారు. ప్రహేళిక పేరిట అనేక పొడుపు కథలను చెప్పి సభికుల నుంచి సమాధానాలను అందుకుని ప్రోత్సహించారు. ముందుగా పాఠశాల విద్యార్థినులు ప్రార్థన గీతాన్ని ఆలపించారు. బిట్రా గజ గౌరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏవి శివకుమారి వందన సమర్పణ చేశారు. ఇందులో ఆనంద్ కుమార్ రెడ్డి, పాల్ కొండయ్య, అరుణ శ్రీనాథ్, రమాదేవి సహా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.