
“జన్మనిచ్చిన తల్లి, కట్టుకున్న భార్య, అల్లారుముద్దుగా పెరుగుతున్న ముగ్గురు పిల్లలూ… అంతా రాత్రికిరాత్రి అతడికి దూరమయ్యారు. ఊహించని ఓ దుర్ఘటన అతన్ని ఒంటరిని చేసి కుటుంబ సభ్యులందరినీ పైలోకాలకు తీసుకుపోయింది.
ఆ పరిస్థితినుంచి మెల్లగా తేరుకొని మళ్లీ సాధారణ మనిషి అయ్యాడు. . తాను మాత్రమే బతకడం కాకుండా బతుకు భారమై దీనంగా రోజులు గడుపుతున్న వృద్ధులకు అండగా నిలుస్తున్నాడు”.
శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, నాయుడుపేట నగర పంచాయతీ బేరిపేటకు చెందిన బెన్నీ… గూడూరు తపాలా కార్యాలయంలో పోస్టల్ అసిస్టెంట్. బెన్నీ సొంతూరు ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు గ్రామానికి చెందిన కొండయ్య.. చెంచమ్మ దంపతుల కొడుకు. తండ్రి తపాలా శాఖలో ఉద్యోగం చేస్తూ చనిపోయాడు. అప్పటికి బిఏ పూర్తిచేసిన బెన్నీకి ఆ శాఖలో ఉద్యోగం వచ్చింది. తర్వాత మేనమామ కూతురు మేరీని పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం… బెనర్జీ, ప్రియాంక, సౌజన్య. శాఖాపరమైన పరీక్షలు రాసి పదోన్నతితో ఒంగోలు కార్యాలయంలో పోస్ట్ మాన్ గా వెళ్లాడు బెన్ని, సొంతూరు నుంచి రోజూ ఒంగోలు వెళ్లివచ్చేవాడు. కుటుంబపరంగా, ఉద్యోగపరంగా కుదురుకున్నాడు. కానీ, అంతలో జీవితం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది.. అనుకోకుండా వచ్చిన వరద కుటుంబానికి శాపంగా మారింది.
…
1996, అక్టోబరు 18… అర్ధరాత్రి దాటాక ప్రకాశం జిల్లా పామూరు సమీప జలాశయ అలుగుకు గండి పడి వరదనీరు దిగువనున్న గ్రామాలపైకి పోటెత్తింది. గాఢనిద్రలో ఉన్న గ్రామవాసులు ఈ ప్రమాదాన్ని కలలో కూడా ఊహించలేదు. అంధకారంలో ఒక్క సారి వచ్చిన వరద నీరు కాసేపటికి గుర్తించిన వారు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రాణాన్ని దక్కించుకునేందుకు తలో’వైపు పరుగు అందుకున్నారు. కానీ చుట్టూ నీరు. దాంతో ఆ నీటిలో కొట్టుకుపోయి చాలామంది ప్రాణాలు పోయాయి. ఆరోజు తపాలాశాఖ ఉద్యోగులు సమ్మె నిర్వహించడం తో బెన్నీ రాత్రికి ఇంటికి రాలేదు. తెల్లారేసరికి జరిగింది తెలుసుకున్న బెన్నీకి నోటమాటరాలేదు. 24 గంటల్లో తనకు ప్రాణమిచ్చిన తల్లి, ప్రాణమైన భార్యాపిల్లలూ తనను ఒంటరివాణ్ని చేసి
లోకాన్ని వీడి వెళ్లిపోవడంతో బెన్నీ ఆ బాధను తట్టుకోలేకపోయాడు. ఆ కాళరాత్రి.. మోపాడు తోపాటు పరిసర గ్రామాల్లో 173 మందిని పొట్టనపెట్టుకుంది. బెన్నీ కుటుంబసభ్యులంతా మూడ్రోజుల తర్వాత గుర్తుపట్టలేని రీతిలో మోపాడు జలాశయం సమీప లోతట్టులో కూరుకుపోయి విగతజీవులై కనిపించారు.
సేవామార్గంలో….
బెన్నీ పడుతున్న మనోవేధనను గుర్తించిన కుటుంబసభ్యులు అతడి జీవితంలో మళ్లీ వెలుగు నింపే ఉద్దేశంతో ఆ దుర్ఘటన జరిగిన ఏడాది తర్వాత మేనత్త కూతురు సునీతతో పెళ్లిచేశారు. పెళ్లి తర్వాత కూడా ఆ విషాదాన్ని మర్చిపోలేకపోయేవాడు బెన్నీ. దాన్నుంచి బయటపడేందుకు సేవా మార్గం ఎంచుకోవాలనుకున్నాడు. ప్రమాదంలో అయినవారందరినీ పోగుట్టుకున్న బెన్నీ ప్రభుత్వం బాధితులకు పంపిణీ చేసిన రూ.5 లక్షల పరిహారాన్ని చాలాకాలంపాటు తీసుకోలేదు. తర్వాత మనసు మార్చుకొని ఆ మొత్తాన్ని స్వీకరించి దాంట్లో రూ. లక్ష పెట్టి తల్లితండ్రుల పేరుమీద సొంతూరులో బస్సు షెల్టరు నిర్మించాడు. స్థానిక పేదలకు పెళ్లిళ్ల సమయంలో తన వంతు సాయం చేసే చాడు. పేద విద్యార్థుల చదువుకు సాయపడేందుకు ప్రత్యేకంగా ఒక టీచర్ని పెట్టి దాదాపు 30 మందికి పాఠాలు చెప్పించాడు.
తోటివారికి సాయపడటంలో దొరుకుతున్న సంతృప్తివల్ల తన సేవల పరిధిని ఇంకా పెంచాలనుకున్నాడు బెన్నీ. అదే సమయంలో పదోన్నతి మీద నెల్లూరు జిల్లా నాయుడు పేటకు చేరుకున్నాడు. కొన్నేళ్లు తన ఇంట్లో ప్రతి ఆదివారం వృద్దులకు ఒకపూట అన్నం పెడుతూ ఆకలి తీర్చేవాడు. అంతటితో సంతృప్తిచెందక నెలకు రూ. 1000 చెల్లించి వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. వరదలో ప్రాణాలు కోల్పోయిన మొదటి భార్య మేరీ పేరుతో వృద్ధాశ్రమం పెట్టి 30 మందికి
పైగా అందులో ఆశ్రయం కల్పిస్తున్నాడు. వారిలో నడవలేక మంచం పట్టినవారు ఉన్నారు. కొడుకులూ, కూతుళ్ల ఆదరణ దూరమైన వృద్ధులను అక్కున చేర్చుకొని
వైద్య పరీక్షలూ, కంటి శస్త్రచికిత్సలూ చేయిస్తూ అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఆశ్రమంలో మృతిచెందిన వృద్ధులకు అంత్యక్రియలు తనే చేస్తున్నాడు కూడా. దాతల విరాళాలకు తోడు తన జీతం రూ.30 వేలలో సగం ఆశ్రమం నిర్వహణకే కేటాయిస్తు వచ్చాడు. ఆశ్రమ నిర్వహణలో కొన్నిసార్లు అనుకోని అవసరాలు వస్తే అవి సరిచేయడానికి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడానికి వెనుకాడడు బెన్నీ. ఆశ్రమంలో వంట చేయడానికి ఒక మహిళను నియమించారు. ఆశ్రమ నిర్వహణ బాధ్యతల్నీ బెన్నీ, అతడి భార్య సునీత చూసుకుంటారు. ప్రస్తుతం ఆశ్రమానికి శాశ్వత భవనం నిర్మించే పనిలో నిమగ్నమ గోడలవరకూ వచ్చింది. బెన్నీ, సునీత తమ ముగ్గురు పిల్లలు బెనర్జీ, కళ్యాజ్, సౌమ్యలను చదివిస్తూ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. మనుషులుగా పుట్టిన మనం సాటి మనుషులకు సాయపడటం బాధ్యతగా
భావించి సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు బెన్నీ దంపతులు. ఒకనాడు ఒంటరివాడైన బెన్నీ… నేడు. అందరివాడయ్యాడు.
దాతలు చేయూతనివ్వండి…. మేరీ వృద్ధుల ఆశ్రమం స్థాపించి నేటికీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అనేక కొరతలతో దాతల సాయం కోసం ఎదురుచూస్తుంది. 2023లో తపాలా శాఖలో పదవీ విరమణ చేసి… ఇప్పుడు పూర్తిస్థాయిలో తన సొంత నిధులతో చివరి దశలో ఆసరా లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులను ఒక చోట చేర్చి వారి బాగోగులు చూసుకుంటున్న బెన్నీ, ఆశ్రమం కు పక్కా భవనం లేక ఎండకు వానకు అవస్థలు పడుతున్నారు. పక్కా భవనం పనులు మధ్యలో ఆగిపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు వృద్ధులు… దాతలు ఎవరైనా పక్కా భవనం స్లాబ్ తదితర పనులు ఆశ్రమం లోని వృద్ధులకు సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు.
దాతలు ఎవరైనా సాయం చేయాలంటే ఈ క్రింది ఉన్నGpay :9652016443 అనే నెంబర్ కు పంపించండి. ఇతర ముఖ్య విషయాలకు సంప్రదించండి
(సెల్. 9493031820)… చెన్నై న్యూస్
..…….