
విజయవాడ న్యూస్ :విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలు భారత అభివృద్ధిని ఓర్చి చూడలేని అసహన ఫలితమని చెప్పారు. దేశ విభజన తర్వాత నుంచి పాకిస్థాన్ శాంతిని దెబ్బతీసే పనిలోనే ఉందని, ఇకపై దాడులకు మేమూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు.
తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఇంద్రాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు మూడుకిలోమీటర్ల పయనం సాగింది. వేలాది మంది ప్రజలు జాతీయ భావంతో పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, సైన్యాన్ని అండగా నిలబెట్టుకోవాలన్నదే దేశ భక్తి లక్షణమన్నారు. సెలబ్రిటీలు వినోదాన్ని పంచగలరే కానీ, దేశాన్ని నడపలేరని తేల్చి చెప్పారు. మురళీ నాయక్ లాంటి యువ సైనికులే నిజమైన దేశభక్తులని, దేశం కోసం ప్రాణం అర్పించిన అతని త్యాగం దేశం మరవదన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: ‘దేశాన్ని పాలించుకోలేక, భారత్‌లో కల్లోలం సృష్టిస్తున్నారు’
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, భారత్‌లో జరిగిన ఉగ్రదాడులన్నింటి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపించారు. ‘వారి దేశాన్ని వారు పాలించుకోలేక, అభివృద్ధి చెందుతున్న భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయి. మన అభివృద్ధిని చూసి పాకిస్థాన్ అసూయతో రగిలిపోతోంది’ అని అన్నారు.
మురళీ నాయక్ స్ఫూర్తి
ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మురళీ నాయక్ వంటి యువకులు దేశ రక్షణలో ప్రాణాలు అర్పించడం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
నవ భారత నిర్మాణం
ఈ కార్యక్రమం దేశభక్తి, సమైక్యత, సమగ్రతను ప్రతిబింబించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని, పాకిస్థాన్ వంటి శత్రుదేశాలు భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.ఈ ర్యాలీ ద్వారా విజయవాడ నగరం జాతీయతతో నిండిపోయింది. ప్రజలు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు తమ దేశభక్తిని ప్రదర్శించారు. భారతదేశం మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు.