
హైదరాబాద్: కాశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత ప్రజలకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని తమ సంస్థ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించి అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించారు.
ఈ సందర్భంగా జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ,
“దేశంలోని ఎక్కడ జరిగిన ఘటన అయినా, అది మొత్తం దేశానికే సంబంధించినదే. అమాయక ప్రజలు విహారయాత్రకు వెళ్లి మరణించటం బాధాకరం. సరిహద్దు భద్రత పటిష్టంగా లేకపోతే ఇలాంటి దాడులు జరుగుతాయి. సరిహద్దులను కాపాడటం అత్యంత క్లిష్టమైన పని. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయం కాకుండా, దేశ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి” అన్నారు.
ఇకపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపై దేశ ప్రజలంతా నిలబడాలని, బాధిత కుటుంబాలకు మనమంతా మద్దతుగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు యువశక్తి సభ్యులు పాల్గొన్నారు.