
విల్లివాక్కం న్యూస్ :చెన్నై మైలాపూర్ లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఇందులో తెలుగు కవుల ను ఘనంగా సత్కరించారు. ముందుగా అరుణ శ్రీనాథ్ ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కే అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు, సీనియర్ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ విచ్చేశారు.
విశిష్ట అతిథిగా గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు లా డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ గుర్రం చిననాగూర్ విచ్చేశారు. సంస్థ కార్యదర్శి, కోశాధికారి వి కృష్ణారావు స్వాగతం పలికారు. కే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ స్మారక భవనం నిర్వహణకు తమ శాయ శక్తుల కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ముఖ్య అతిథి కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ…. చెన్నై నగరంలో ఎన్నో తెలుగు సంస్థలు ఉన్నాయని ఇవన్నీ కలిసికట్టుగా నెహ్రూ స్టేడియంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమానికి తన వంతుగా ₹50 వేలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో తెలుగు ప్రజల బలం నిరూపించుకోవాలని కోరారు. మాతృభాషను, మాతృభూమిని , మాతృమూర్తిని మరువకూడదు అన్నారు. అనంతరం గుర్రం చిననాగూర్ మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణల కంటే చెన్నైలో తెలుగువారు మాతృభాషకు ఎంతో కృషి చేస్తున్నట్లు ప్రశంసించారు. అమరజీవి స్మారక సంస్థకు తన వంతు సహకరిస్తానని తెలిపారు. ఇందులో 18 మంది కవులకు ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేశారు. అనంతరం కల్పన శ్రీనివాస్ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. కవితల పోటీల్లో కమలాకర రాజేశ్వరి, సి.ఉదయశ్రీ, కె.వి. కృష్ణశాస్త్రి ప్రధమ ,ద్వితీయ, తృతీయ బహుమతులను అందుకున్నారు. కవులకు విద్వాన్ డాక్టర్ కాసల నాగభూషణం అభినందనలు తెలిపారు. ఇందులో కమిటీ సభ్యులు డాక్టర్ విస్తాలి శంకర్రావు సభ నిర్వహణ చేశారు, డాక్టర్ ఏవి శివకుమారి వందన సమర్పణ చేశారు. ముందుగా డాక్టర్ టి.ఆర్.ఎస్ శర్మ పంచాంగ శ్రవణం గావించారు. ఇందులో కమిటీ సభ్యులు ఎంవి నారాయణ గుప్తా, జె యం నాయుడు తో సహా పలువురు తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.
………….