
చెన్నై న్యూస్ :నవరసాలను అద్భుతంగా అవలీలగా ప్రదర్శించగల మేటి నటి సూర్యకాంతం అని జాతీయ సదస్సులో వక్తలు కొనియాడారు. స్థానిక పట్టాభిరామ్‌లోని ధర్మమూర్తి రావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హిందూ కళాశాల తెలుగు శాఖ, తెలుగు భాషా సమితి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి – యువ సంయుక్తంగా నిర్వహించిన “సూర్యకాంతం నటనా వైభవంలో నవరసాలు” అనే అంశంపై జాతీయ సదస్సు వైభవంగా జరిగింది.
ప్రారంభోత్సవ సభలో ముఖ్యోపన్యాసకురాలిగా పాల్గొన్న ద్రావిడ విశ్వవిద్యాలయం (కుప్పం) విశ్రాంత ఆచార్యురాలు డా. జెవి సత్యవాణి నవరసాల పరంగా సూర్యకాంతం నటనా ప్రతిభను విశ్లేషించారు. నవరసాలను తన నటనలో ఎంత అద్భుతంగా మలచారో వివరిస్తూ, ఒకే సినిమాలో ఒక్కసారిగా మూడు రసాలను పోషించిన ఘనత ప్రపంచ చలనచిత్ర రంగంలో ఆమెకే సాధ్యమైందని తెలిపారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సూర్యకాంతం తనయుడు డా. అనంత పద్మనాభ మూర్తి తన తల్లి నటనా విశిష్టతను గుర్తుచేసుకున్నారు. ట్రిబ్యునల్ జడ్జి జయచంద్ర మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను సినిమాల్లో ప్రదర్శించడంలో సూర్యకాంతం ప్రత్యేకతను కొనియాడారు. కూచిపూడి నాట్యకారుడు మాధవపెద్ది మూర్తి మాట్లాడుతూ, నాట్యంలో రసపోషణ సులభమైనప్పటికీ, కెమెరా ముందు నటించడంలో సూర్యకాంతం అందరికంటే గొప్పగా రసాలను ప్రదర్శించగలిగారని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ రచయిత చిర్రావూరు మదన్ మోహన్ ఆమె నటించిన సినిమాల సారాంశాన్ని కవిత రూపంలో వినిపించి ఆకట్టుకున్నారు. రచయిత్రి జలంధర మాట్లాడుతూ తెరమీద అత్తగా కనిపించిన సూర్యకాంతం, తెరవెనుక మాత్రం తల్లి ప్రేమను పంచారని గుర్తుచేశారు. హాస్య రచయిత్రి జోస్యుల ఉమ రూపొందించిన పేరడీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సమాపన సభలో ప్రముఖ నటి రోజారమణి, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు సూర్యకాంతం గురించిన తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. కళాశాల విద్యార్థులు రూపొందించిన శబ్దచిత్ర మాలికను ప్రదర్శించి, శిక్షణ అందించిన గుడిమెళ్ల మాధురీనీకళాశాల ప్రిన్సిపాల్‌ను సత్కరించారు.
ఈ కార్యక్రమ నిర్వహణ డా. తుమ్మపూడి కల్పన చేపట్టగా, తెలుగు శాఖాధ్యక్షుడు డా. సురేశ్, సహాయాచార్యులు డా. డి. ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నగరానికి చెందిన తెలుగు ప్రముఖులు, కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.