
చెన్నై న్యూస్: విశ్వర్షి వాసిలి విశిష్ట యౌగిక విశ్వకవి. విశ్వజనీనమైన సాహిత్య రచన కొద్దిమందికే సాధ్యం. అందునా విశ్వకవి కావడం చాల అరుదైన విషయం. డా. వాసిలి వసంతకుమార్ గారు ఈ ఆధునిక కాలంలో, మానవ నాగరికతలు విభిన్న దృక్పథాలుగా, ధోరణులుగా మారిపోతున్న ఈ సమయంలో, సరళమైన తెలుగు భాషలో, సామాన్యునికి సహితం అవగాహన అయ్యే రీతిలో ఆధ్యాత్మిక సాహిత్యం, అందునా యౌగిక, తాత్త్విక సంబంధ విషయాలు వ్రాయడం సాహసోపేతమైన లోచన, కృషి. మానవ అంతరంగం నుండి, వ్యక్తి వికాసం వరకూ ఎంతో ఆసక్తిదాయకంగా చదివించే విషయాలను పద్యంలోనైనా, గద్యంలోనైనా వారి కలం కవితాత్మకంగా, లయాత్మకంగా, పరిపుష్ట విషయ సమగ్రతతో ఆవిష్కరించటం అద్భుత విశేషం … మాకెంతో హర్షణీయం.” అంటూ మన పీఠాధిపతి డా. ఉమర్ ఆలీ షా వారి అభినందనలను అందుకున్న “విశ్వర్షి వాసిలి”గారు నిజానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేని బహుముఖీన వ్యక్తి, బహుళ గ్రంథకర్త, సంపాదకులు. తమదైన ముద్ర ఉన్న సాహిత్యస్రష్ట. వారం వారం తెలుగు పత్రికలలో కనిపించే పత్రికా రచయిత. మాస్టర్ యోగాశ్రమం, యోగాలయ, విశ్వర్షి ఫౌండేషన్ సంస్థల ద్వారా వేలమంది యోగసాధకులకు మార్గదర్శిగా ఉన్న మాస్టర్ సివివి యోగమార్గ గురువు.
గత ఇరవై ఏళ్లుగా ఏదో ఒక పత్రికలో ఆ వారం వీరి రచన కనిపించని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. ‘విశ్వగీత’, ‘మూడోకన్ను’ కాలమ్స్ తో ఆంధ్రప్రభ, ‘విను నా మాట’, ‘వినదగు’ ‘వాసిలి వాకిలి’, ‘యువ’, ‘వ్యక్తిత్వం’ కాలమ్స్ తో ఆంధ్రభూమి, ‘చింతన’ మొదలైన కాలమ్స్ తో ఆంధ్రజ్యోతి, సాక్షి పాఠకులకు గత ఇరవై ఏళ్లుగా చిరపరిచితులు. వారి వ్యక్తిత్వవికాస వ్యాసాలు, తాత్విక వ్యాసాలు, యోగ వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు మనందరికీ తెలుసు.
వాసిలి డిగ్రీ చదువుతుండగానే ‘చిత్ర ప్రగతి’ అనే సినిమా పక్షపత్రికకు సంపాదకులు. ఆ తర్వాత ‘యోగ మార్గం’, ‘యోగద ర్శిని’ అనే యోగపత్రికలకు పుష్కర కాలంపాటు సంపాదకులు. ఇక సాహిత్య ప్రపంచానికి, తెలుగు పరిశోధకులకు వారి ‘తెలుగు పరిశోధన’ పత్రిక, అందులో వారు రాసిన రీసెర్చ్ మెథడాలజీ వ్యాసాలు ఎంతగానో ఉపయుక్తాలు. అయిదేళ్లు ‘ఉషోదయం’ దినపత్రికకు సహాయసంపాదకులు కూడా. సీనియర్ సిటిజన్స్ పత్రిక అయిన ‘ఆవలితీరం’ పత్రికకు గత ఏడేళ్లుగా సంపాదకులు.
డా. వాసిలి వసంతకుమార్ పుట్టింది జులై 10, 1956న గోదావరీ తీర నిడదవోలు పట్టణ సమీప సమిశ్రగూడెం గ్రామాన. తండ్రి ప్రముఖ సాహితీవేత్త, మాస్టర్ సివివి యోగమార్గ మహాగురువు శార్వరి. తల్లి యామినీదేవి. బి.ఏ. దాకా వాసిలివారి విద్యాభ్యాసం ఆంగ్లమాధ్యమంలో సాగింది. మద్రాస్ విశ్వవిద్యాలయం 1976లో తొలిగా ఎం.ఏ. తెలుగును ప్రవేశపెట్టడంతో విశ్వవిద్యాలయ శాఖ తొలి బ్యాచ్ విద్యార్థిగా సాహిత్య ప్రపంచంలోకి అడుగేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “తెలుగు నవల : అస్తిత్వ తాత్వికత”పై డాక్టరేట్ పొందారు.
1978 లో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసుకుని హైదరాబాద్ చైతన్య కళాశాలలో లెక్చరర్ గా చేరారు. ఆ తర్వాత “అవేర్” సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా రెండేళ్లు బాధ్యతలు నిర్వహించారు. అమెరికాలోను అయిదేళ్లు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా ఉద్యోగం చేసారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని మాగ్నా ఇన్ఫోటెక్ లో మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించారు.
వాసిలి తమ షష్టిపూర్తి వరకు డా. వాసిలి వసంతకుమార్ గానే ప్రసిద్ధులు. గత ఏడేళ్లుగా ‘విశ్వర్షి వాసిలి’గా తమ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ తొలి బ్యాచ్ విద్యార్థి అయిన వాసిలి వారు తెలుగులో తొలి యౌగిక కావ్యం “నేను” కావ్యకర్తగా సాహిత్య చరిత్ర కెక్కటం అపూర్వం. “నేను” కావ్యాన్ని ఆవిష్కరించిన మద్రాస్ విశ్వవిద్యాలయమే అక్కడి పరిశోధక విద్యార్థికి “నేను”పై ఎం.ఫిల్. సిద్ధాంతపత్ర సమర్పణకు అవకాశమిచ్చి ఏడాదిలోనే ఎం.ఫిల్. పట్టాను ఇవ్వటం వాసిలివారికి లభించిన అద్భుత సన్మానం. ఇక ఈ “నేను” యౌగికకావ్యం “నాను” కావ్యంగాను, “56 ఆత్మదర్శనాలు” “56 ఆత్మదర్శనగళు”గాను కన్నడంలోకి అనువదింపబడి ప్రచురణ దిశలో ఉన్నాయి. “నేను” యౌగికకావ్యం “మై…”గా హిందీలోకి అనూదితమై త్వరలో విడుదల కానుంది. ఈ “నేను” కావ్యం ఆంగ్లంలోకి సైతం అనువదింపబడుతోంది.
డా. వాసిలి వ్యక్తిత్వ వికాసంపై అనేక రచనలు చేసారు. “ది విన్నర్ : గెలవాలి గెలిపించాలి”, “సిగ్గుపడితే సక్సెస్ రాదు”, “టైం ఫర్ సక్సెస్”, “ఒత్తిడి ఇక లేనట్లే” అనే పుస్తకాలతో పాటు “పెళ్లి మైనస్ పెటాకులు”, “లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే” అనే రచనలు ఇప్పటికే అనేక ముద్రణలు పొందాయి. “ది విన్నర్ : గెలవాలి! గెలిపించాలి!!” ఆంగ్లంలో “Winner : Win and make Winners”గా ఆంగ్లంలో వెలువడింది. డా. వాసిలివారి “మనసును గెలవాలి”, “మనకే తెలీని మన రహస్యాలు” మనోవైజ్ఞానిక రచనలుగా పేరుపొందాయి. “మనకే తెలీని మన రహస్యాలు” పుస్తకం “నమగే తెలియద నమ్మ రహస్యగళు”గా కన్నడంలోకి అనువదింపబడి ముద్రణలో ఉంది. ఇక దాదాపు మూడేళ్ల పాటు ఆంధ్రభూమి దినపత్రికకు వారంవారం రాసిన వ్యాసాలు ”కొత్తకోణంలో గీతారహస్యాలు” పేరిట ఇప్పటికే “జీవనగీత”గాను, “ఆత్మగీత”గాను గ్రంథాలుగా వచ్చి భగవద్గీతపై కొత్త వెలుగులను ప్రసరిస్తున్నాయి. త్వరలో మూడు నాలుగు భాగాలైన “నాయక గీత”, “యౌగికగీత”లు వెలువడనున్నాయి.
యోగ సాహిత్యంగానూ వాసిలివారు అనేక గ్రంథాలు వెలువరించారు. వారి “77 సాధనా రహస్యాలు” గ్రంథం ఇప్పటికే అయిదుమార్లు ముద్రితం కావటమే కాక కన్నడ భాషలోకి “77 సాధనా రహస్యగళు”గా అనువదింపబడి మొదటిముద్రణ ప్రతులు అయిపోవటంతో రెండవ ముద్రణలో ఉంది. వీరి “56 ఆత్మదర్శనాలు”, “అతీంద్రియ రహస్యాలు : బ్లవట్స్కీ” తాత్విక రచనలు నాలుగుమార్లు పునర్ముద్రణలు పొందాయి. “యోగలయ”, “ప్రజ్ఞాన రహస్యాలు”, “మానవ తత్వ దర్శనాలు” యోగ సాహిత్యంలో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోవటమే కాక పునర్ముద్రణ పొందిన గ్రంథాలు కూడా. వాసిలివారు వారి తండ్రి శార్వరిగారి జీవిత చరిత్రను “మాస్టర్ శార్వరి : మిషన్ అండ్ విజన్” పేరిట గ్రంథస్థం చేశారు. ఇవికాక వాసిలివారు సంపాదకత్వం వహించిన “శార్వరీయ యోగం”, “అరవై వసంతాల శార్వరి”, “అరవై వసంతాల యామిని”, “క్షేత్రదర్శిని”, “యోగానుభవాలు”, “స్పందన” వంటి సంకలనాలు అనేకం ఉన్నాయి. మాస్టర్ యోగాశ్రమం ప్రచురించిన వందల గ్రంథాలకు వాసిలివారు సంపాదకులు.
విశ్వర్షి వాసిలి వారు తొలుతగా రాసిన పుస్తకాలు “అధ్యయన సాహితి’, “ఆధ్యాత్మిక జీవితం : అస్తిత్వ దృక్పథం” అన్న పుస్తకాలను జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు 1985 లో ఆవిష్కరించారు. ఈ ఏడాది వీరి కొత్త పుస్తకాలు “మాస్టరిజమ్ : ఖగోళ రహస్యాలు”, “మూడో కన్ను : మృత్యు, కర్మ, జన్మ రహస్యాలు” తాత్విక రచనలుగాను; “దృక్సూచి”, “లోనారసి” సాహిత్య రచనలుగాను; “జీవసంహిత”, “ఏడో ఋతువు” వచన కవితా సంపుటాలుగాను; “స్వీట్ సిక్స్టీ” “యూత్ సైకాలజీ” మార్గదర్శక గ్రంథాలుగాను రానున్నాయి. 1985 నుండి 2005 వరకు వాసిలి వసంతకుమార్ గారు తమ కలాన్ని పక్కన పెట్టారు. అయినా గత రెండు దశాబ్దాలుగా వారి సాహిత్య వ్యవసాయం పదహారు పువ్వులు అరవై పుస్తక ఫలాలుగా సాగుతోంది. వేయి వ్యాసాలుగా వివిధ వర్గాలవారిని అలరిస్తూ వస్తోంది.
విశ్వర్షి వాసిలి వారిని మద్రాసు విశ్వవిద్యాలయం “జీవిత సాఫల్య పురస్కారం”తోను, “అక్షరయోగి”గాను సత్కరించింది. గత ఏడాది విశ్వర్షి వాసిలి వారి అన్ని రచనలపై “విశ్వర్షి వాసిలి సాహిత్యం – వ్యక్తిత్వం – యౌగికతత్త్వం” పేరిట అరవై మంది పత్ర సమర్పకులతో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులను నిర్వహించింది. మూడు వందల పుటలతో ఒక ప్రత్యేక సంచికను ఆవిష్కరించింది.
*విశ్వర్షి ‘యోగాలయ’ గురించి*
విశ్వర్షి వాసిలి నిర్వహించే సంస్థలు :
1. *యోగాలయ పరిశోధన కేంద్రం*.
మన మానవ జన్మ ఒక పరిశోధనా కేంద్రం. అణువుగా నైనా, ఆత్మగానైనా ఈవిశ్వావరణలో మన జీవితం ఒక పరిశోధన అంశం. కాబట్టి మానవుడు పుస్తకాల పుటలలో దూరినా, మనుషుల మనసులులో దూరినా, ఆత్మలలో దూరినా అతని వ్యక్తిత్వంలో గానీ, వర్తనంలో గానీ మార్పు రావాలి. కాబట్టి దానికి అవసరమైన ప్ర’యోగ’శాలగా ఈ కేంద్రం యోగ-తత్వ శాస్త్రాలకు, మూర్తిమత్వ వ్యక్తిమత్వాలకు చెందిన సాహిత్యానికి, మనో విజ్ఞాన శాస్త్ర అంశాలకు, సామాజిక శాస్త్రానికి, యోగ-ధ్యాన విషయాలకు కేంద్రంగాను, ఒక పుస్తక భాండాగారంగాను ఉండి పలు రంగాల వారికి ఉపయుక్తమవుతోంది.
2.*యోగాలయ పురా సంపద కేంద్రం*
అమూల్యం అనిపించే మూల సంపద మన వద్ద లేకున్నా, ఎక్కడో ఉన్న ఆ మూల సంపదను ప్రతిబింబంగాను, ప్రతిరూపంగాను మన దగ్గర ఉంచాలి అనే ఆశయంతో వాటిని సేకరించి ఇక్కడ భద్రపరచటం జరుగుతోంది.
3.*యోగాలయ సంక్షేమ కేంద్రం*
నేను నుండి మన దాకా ప్రయాణిస్తూ అందరూ బాగుండాలి అనే సంకల్పం తో ఒక మాట చాలు చేతగా రూపాంతరం చెందడానికి, అవసరాలు తీర్చడానికి అన్న లక్ష్యంతో ఈ కేంద్రం సేవలను అందిస్తోంది.
4. యోగలయ కౌన్సిలింగ్ కేంద్రం
ఒక మంచి మాట చాలు జీవిత గమనాన్ని మార్చడానికి … ఒక అనునయ వాక్యం చాలు స్వాంతన పొందడానికి, ఒక చేతి స్పర్శ చాలు ఉపశమనం చెందడానికి, ఒక గెలుపు సూత్రం చాలు విజయ పంథాను అనుసరించడానికి, అంతరంగాన్ని మేల్కొల్పగలిగితే చాలు జ్ఞాన మగ్నo కావడానికి అనే విషయాలకు మార్గదర్శకంగా ఈ కేంద్రం పని చేస్తుంది.
5. యోగాలయ మాధ్యమ కేంద్రం
అక్షర మాధ్యమం నుండి శ్రవణ, దృశ్య మాధ్యమం దాటి ప్రవహించే మనస్సుకు ఒక ప్రధాన మాధ్యమం ధ్యానం. అనేక ధ్యాన ప్రక్రియలను పుస్తకాలు, ఆడియోలు, వీడియోలు ద్వారా ఈ కేంద్రం అందిస్తున్నది.
ప్రతీ రోజూ ఉదయ, సాయంకాలాలు అంతర్జాలం ద్వారా యోగ సాధనా తరగతులను నిర్వహిస్తున్నారు.
***
*విశ్వర్షి వాఙ్మయం*
*యౌగిక వాఙ్మయం*
1. యోగలయ
2. 77 సాధనా రహస్యాలు
3. 56 ఆత్మదర్శనాలు
4. అతీంద్రియ రహస్యాలు : బ్లవట్స్కీ
5. మాస్టర్ శార్వరి మిషన్ & విజన్
6. మాస్టరిజం : ప్రజ్ఞాన రహస్యాలు
7. మాస్టరిజం : ఖగోళ రహస్యాలు
8. మాస్టరిజం : యౌగిక రహస్యాలు (ముద్రణలో)
9. మాస్టరిజం : మృత్యు, కర్మ, జన్మ రహస్యాలు
10. ఆధ్యాత్మిక ప్రసంగ లహరి
11. ఆధ్యాత్మిక జీవనతత్వం : అస్తిత్వ దృక్పథం
*కావ్య వాఙ్మయం*
12. నేను : యౌగిక కావ్యం
13.జీవన సంహిత (కవితాత్మికలు)
14. ఏడవ ఋతువు (వర్తమాన వచన కవితలు) *పరిశోధనా వాఙ్మయం*
15. జీవనగీత (కొత్తకోణంలో గీతారహస్యాలు 1)
16. ఆత్మగీత (కొత్తకోణంలో గీతారహస్యాలు 2)
17. నాయకగీత (కొత్తకోణంలో గీతారహస్యాలు 3)
18. యౌగికగీత (కొత్తకోణంలో గీతారహస్యాలు 4)
19. అస్తిత్వ తాత్వికత
20. తెలుగు నవల : అస్తిత్వాత్మక నాయకులు
*వ్యక్తిత్వ వికాస వాఙ్మయం*
21. ది విన్నర్ : గెలవాలి! గెలిపించాలి!!
22. సిగ్గుపడితే సక్సెస్ రాదు
23. టైమ్ ఫర్ సక్సెస్
24. ఎమోషనల్ అయినా గెలవాల్సిందే!
25. ఒత్తిడి ఇకలేనట్లే!
*మనో వికాస వాఙ్మయం*
26. మనసును గెలవాలి!
27. పెళ్లి : ఒక బ్రతుకు పుస్తకం
28. టీనేజ్ సైకాలజీ : స్వీట్ సిక్స్టీన్
29. స్వీట్ సిక్స్టీ : వృద్ధత్వ వెలుగులు
*తాత్త్విక వాఙ్మయం*
30. మనకే తెలీని మన రహస్యాలు
31. మానవ తత్త్వదర్శనాలు
*తాత్త్విక వాఙ్మయం*
32. అధ్యయన సాహితి
33. సాహిత్య ప్రసంగ కౌముది
34. దృక్సూచి (వాసిలి రచనలపై సమీక్షలు)
35. లోనారసి (వాసిలి చేసిన సమీక్షలు)
36. మున్నుడి (ముందు మాటలు)
*సంపాదక వాఙ్మయం*
పత్రికలు –
37. తెలుగు పరిశోధన (త్రైమాసిక)
38. యోగ మార్గం (త్రైమాసిక)
39. చిత్రప్రగతి (పక్ష పత్రిక)
40. ఆవలి తీరం (మాస పత్రిక)
పుస్తకాలు –
41. అరవై వసంతాల శార్వరి
42. అరవై వసంతాల యామిని
43. శార్వరీయ యోగం
44. స్పందన
45. యోగానుభవాలు
*అనువాద వాఙ్మయం*
కన్నడం –
46. 77 సాధనా రహస్యగళు
47. నమగె తెలియద నమ రహస్యగళు
48. నాను (యౌగికకావ్య)
49. 56 ఆత్మదర్శనగళు (ముద్రణలో)
50. జీవన సంహితె (ముద్రణలో)
హిందీ –
51. మై (యౌగికకావ్య)
ఇంగ్లీష్
52. Winner : Win and Make Winners
53. 77 Secrets of Spirituality
*ప్రక్రియా వాఙ్మయం*
54. మోహనాంగి (చారిత్రక నాటిక)
55. ఆకాశవాణి నాటికలు, కథలు
56. ఆకాశవాణి సాహిత్య వ్యాసాలు, సమీక్షలు
57. వాసిలి ప్రసారిత కవిత్వం
58. వాసిలి కథలు, గల్పికలు
*సదస్సుల వాఙ్మయం*
59. విశ్వర్షి వాసిలి సాహిత్యం, వ్యక్తిత్వం,
యౌగికతత్త్వం (మద్రాసు విశ్వవిద్యాలయ
అంతర్జాతీయ సదస్సు పత్రాల సంకలనం)
60. తొలి తెలుగు యౌగికకావ్యం “నేను” (సప్తపథ
సదస్సుల సమాలోచనా పత్రాలు)
61. విశ్వర్షి వాసిలి అక్షరాక్షర ప్రస్థానం
(116 అంతర్జాతీయ సదస్సు పత్రాల సంకలనం)
***
*ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ
సదస్సులకు ఆహ్వానం*
తెలుగు సాహిత్యంలో తొలి యౌగిక కావ్యం “నేను” కావ్యకర్తగా విశ్వర్షి వాసిలి ‘అక్షరయోగి’గాను, ‘విశ్వకవి’గాను ప్రఖ్యాతులు. వారి సిద్ధాంతాలు సుబోధకాలు … వారి మార్గాలు ప్రత్యేకాలు … వారి దృక్పథాలు ఆలోచనీయాలు … వారి దృక్కోణాలు విభిన్నాలు … వారి అడుగులు అనుసరణీయాలు … వారి చూపులు అంతరంగాన్ని తడుముతాయి … వారి మాటలు హృదయాన్ని తడుపుతాయి … వారి చేతలు ఊరడిస్తాయి. ఇలా వారి వ్యక్తిత్వం వ్యక్తిమత్వంగా ప్రభావం చూపుతూ వారిని అనుసరించేలా చేస్తుంది. వారే మన విశ్వర్షి.
ఇంటి పేరు వాసిలి. ఇంట పెట్టిన పేరు వసంతకుమార్. సాహిత్య ప్రపంచానికి యాభై పైచిలుకు పుస్తకాలతో రచయిత డా. వాసిలి వసంతకుమార్ గా అయిదు దశాబ్దాలుగా చిరపరిచితులు. పాత్రికేయ రంగంలో కాలమిస్ట్ డా. వాసిలిగా, విశ్వర్షి వాసిలిగా గత ఇరవై ఏళ్లుగా పాఠకులకు పరిచితులు. పత్రికల సంపాదకునిగా అనుభవజ్ఞులు. యాభై ఏళ్లుగా యోగ సాధకులు. మాస్టర్ యోగమార్గంలో గురువులు.
***
తెలుగులో స్నాతకోత్తర పట్టాను అందుకున్న మద్రాసు విశ్వవిద్యాలయంనుండే ‘అక్షరయోగి’ బిరుదును, జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నవారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తమ తొలి స్నాతకోత్తర విద్యార్థి అయిన విశ్వర్షి వాసిలి వారి సమగ్ర సాహిత్యంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులను నిర్వహించి తమ విద్యార్థిని సన్మానించుకుంటూ తమను తాము సన్మానించుకుంది. ఇప్పుడు విశ్వర్షి వాసిలివారి వాఙ్మయ వరివస్యను రెండురోజుల అంతర్జాతీయ సదస్సులతో మీ ముందుకు తెచ్చేందుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, ఎస్.కె.వి.పి.-డా.కె.ఎస్.రాజు కళాశాల పూనుకుని నవంబర్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్న సదస్సులకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నవి.
***
విశ్వర్షి వాసిలివారికి విద్యార్థులు అన్నా, యువత అన్నా అత్యంత ఆసక్తి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని సదా కాంక్షిస్తుంటారు. అందుకే వారు కలం పట్టి విద్యార్థుల కోసం చేసిన తొలిరచన ది విన్నర్. గెలవటం ఎంత ముఖ్యమో గెలిపించటమూ అంతే ముఖ్యం అన్నది వాసిలివారి లక్ష్యం. గెలవాలి గెలిపించాలి, ఒత్తిడి ఇక లేనట్లే, సిగ్గుపడితే సక్సెస్ రాదు, టైమ్ ఫర్ సక్సెస్, లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే, పెళ్లి : ఒక బ్రతుకు పుస్తకం వంటి వ్యక్తిత్వవికాసంపై రాసిన వారి పది పుస్తకాల టైటిల్స్ చూస్తే చాలు వారు ఎంత ముక్కుసూటి వ్యక్తో అర్థం అవుతుంది. వారి ప్రతి వాక్యం నినాదంగా ప్రతిహృదయాన్ని తాకి, మేల్కొల్పుతుంది. వాసిలివారి ప్రతి గ్రంథ శీర్షిక, అధ్యాయ శీర్షిక విద్యార్థులకు పిలుపు నిచ్చినట్లే ఉంటుంది. వారి రచనలు యువతను తీర్చిదిద్దేందుకే అని ఇట్టే తెలిసిపోతుంది. వారి లక్ష్యం, వారి గమ్యం యువతను వారి వెంట నడిపిస్తుంది. అందుకే కొన్ని సమావేశాలను, కార్యశాలను, వాసిలివారితో ముఖాముఖిని ప్రత్యేకంగా యువత కోసం, విద్యార్థుల కోసం ఈ అంతర్జాతీయ సదస్సులలో కేటాయించటం జరిగింది
***
*పత్ర సమర్పకులకు గమనిక*
వినూత్న రీతిన జరగనున్న ఈ సదస్సుల్లో తలపండిన పండితులు, ఆచార్యులు, కవులు, రచయితలు, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ ప్రముఖులు, పరిశోధకులు, విద్యార్థులు పత్రసమర్పణ చేయనున్నారు. మరిన్ని పత్రాలతో ఈ సదస్సు దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ … పత్ర సమర్పణకు గడువు తేదీని ఈ నెల 20 వరకు పొడిగించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ పత్రాలు సమర్పించవలసిందిగా మనవి