
చెన్నై న్యూస్: ఇటీవల చెన్నై నగరంలో ఒక బహిరంగ సభలో సినీ నటి కస్తూరి మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రితం తమిళనాడు లోని అంతఃపుర రాణులకు సేవ చేయటానికి వచ్చిన వారే తెలుగువారని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడడమే గాక తెలుగు మాట్లాడితే చాలు మంత్రివర్గంలో స్థానం సంపాదిస్తున్నారని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఈ చర్యలను ఖండిస్తూ అనేక తెలుగు సంఘాలు నిరసనలు చేయడమే గాక అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన పిదప ఐపీసీ చట్టంలోని 4 కేసులను చెన్నై ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో కస్తూరిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సమన్లు జారీ చేయడానికి పోలీసులు కస్తూరి ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి పారిపోయారు. అంతేగాక తన సెల్ ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేశారు. ఈ విషయంపై ఈరోజు కరుణానిధి పూర్వికుల స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు పక్కనే ఉన్న చెరువు కొమ్ము పాలెం గ్రామాన్ని ద్రావిడ దేశం కృష్ణారావు సందర్శించి కరుణానిధి బంధువుల సాయంతో శిధిలావస్థలో ఉన్న కరుణానిధి ఇంటిని ద్రావిడదేశం కార్యకర్తలతో సందర్శించారు. అక్కడ కృష్ణారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒక బీసీ వర్గానికి చెందిన తెలుగు వారైన కరుణానిధి గారి పూర్వీకులు తమిళనాడులో ఒకప్పుడు స్థిరపడ్డారనియు , కరుణానిధి తన వాక్చాతుర్యంతో, సినీ రంగంలో పదునైన తన సంభాషణలతో తమిళనాడు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యారు అంటే బీసీలకు ఇది ఒక గర్వకారణం అని కృష్ణారావు అన్నారు. దేశం మొత్తం మీద పెరియార్ సిద్ధాంతాలను పాటిస్తూ తమిళనాడులో సామాజిక న్యాయాన్ని అమలుపరిచిన అంతటి మహా నాయకుడు కుటుంబాన్ని చిన్న చిన్న వేషాలు వేసుకొనే సినీ నటి కస్తూరి కేవలంగా మాట్లాడటమే గాక తెలుగువారిని అందర్నీ కించపరుస్తూ ప్రసంగాలు చేసి ఇప్పుడు పోలీసులకు భయపడి పారిపోయిందని ఆమె ఎక్కడ ఉన్నా పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేయాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు కస్తూరి ఫోటోలకు నిప్పంటించి తమ నిరసనను తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బంకా చిరంజీవి, యాదవ జేఏసీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సిరుమామిళ్ల గోపికృష్ణ యాదవ్, కాటమరాజు ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజు యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు డాక్టర్ వెంకటేశ్వర్లు, రంగారావు, కొండలు, మిరియాల రాఘవ, పెళ్లూరు శేషారావు తదితరులు పాల్గొన్నారు.
……………..