
కోడంబాకం న్యూస్ :సనాతన ధర్మం పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గత కొద్దీ రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేయడం ఫై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
సనాతన ధర్మం వైరస్ లాంటిది, దానిని అరికట్టాలి అని ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ జాతీయవ్యాప్తంగా బీజేపీ నేతలు, హిందువులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆ వ్యవహారంపై స్పందించారు.
ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఈపాటికి దేశం తగలబడి పోయి ఉండేదని పవన్ అన్నారు. కానీ, హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని పవన్ ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారు వస్తారు, పోతారు అని, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ అన్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఫై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ‘వెయిట్ అండ్ సీ’ (వేసి చూద్దాం) అని సమాధానం ఇచ్చారు. అంటే తర్వాత ఏంచేస్తారు..? సనాతన ధర్మం పట్ల మరోసారి స్టాలిన్ ఏమైనా స్పందించబోతున్నారా..? లేక పవన్ కళ్యాణ్ పై మాటల యుద్ధం చేయబోతున్నారా..? అసలు ఏంచేయబోతున్నాడు స్టాలిన్ అని అంత మాట్లాడుకుంటున్నారు.
మరోపక్క డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఏ మతం గురించి, లేదా ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కానీ ‘కుల వివక్ష, అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రం ఆపదు’ అని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారని, కానీ ఎన్ని కోట్ల రూపాయలు మేర అవినీతి జరిగిందో తెలియదు కానీ దీనిపై తప్పనిసరిగా దర్యాప్తు జరగాల్సిందేనని హఫీజుల్లా పేర్కొన్నారు.
ఇక తమిళనాడుపైనా ఉత్తరాదిపైనా ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు పవన్ కళ్యాణ్. గతంలో ఇంత తీవ్రంగా హిందూత్వ, సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ మాట్లాడింది లేదు. ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయి కాషాయ వాదనను వినిపిస్తూ వస్తున్నారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్ ఇలా చేస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
………………………