
విల్లివాకం న్యూస్: ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు భూసారపు వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. 1964లో చెన్నై చిత్ర సీమకు పరిచయం అయిన ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ చిత్రాలలో అనేకం నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 1,000 చిత్రాలకు పైగా పనిచేశారు. సినీ గీత రచయిత రాజశ్రీ తో కలిసి రచయితగా పనిచేశారు. డబ్బింగ్ ఆర్టిస్టులు సాయికుమార్, రత్నకుమార్, నారాయణ బాబు, గౌరీ ప్రియ, లక్ష్మిలను ఎంతగానో ప్రోత్సహించారు. ఈయన నటుడు పీజే శర్మ సమకాలీనులు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరు చెన్నై, హైదరాబాద్ లలో నివసిస్తుండగా మరొకరు వర్జీనియా (యూఎస్)ఏ లో ఉన్నారు. చెన్నై కోడంబాక్కం విశ్వనాథపురం లోని స్వగృహంలో కన్నుమూసిన ఆయన భౌతిక కాయానికి చిత్ర రంగానికి చెందిన పలువురు నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 12:00 గంటలకు చెన్నైలో జరిగాయి.