ఏడు క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్‌కునీటి విడుదల
ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. దీంతో అధికారులు ఏడు క్రస్ట్‌గేట్లను 10 అడుగులమేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌కు నీటిరాక పెరిగింది. మంగళవారం జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి నుంచి 19,653 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల ద్వారా 2,61,543 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. సుకేశుల నుంచి 1,07,246 క్యూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 3,88,460 క్యూసెక్కుల నీరు చేరుకోగా.. రిజర్వాయర్ నుంచి 4,13,178 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైనట్లు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 207 టీఎంసీలుగా ఉన్నది. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 25,684 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి ద్వారా చేసి దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరో వైపు శ్రీశైలం జలాశయం డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులన్నీ పర్యాటకులతో సందడిగా మారాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలం బాటపడుతున్నారు. మరో వైపు రిజర్వాయర్‌కు వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా ఎవరూ వెళ్లొద్దని సీఐ ప్రసాదరావు హెచ్చరించారు. మంగళవారం ఉదయం టూరిజంశాఖ అధికారులకు, మత్స్యకారులకు నోటీసులు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు పడవలు నడపొద్దని సూచించారు.