వెలువడిన అధికారిక ప్రకటన
భారత జాతీయ క్రికెట్ జట్టు తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న తర్వాత జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోగా.. ఇప్పుడు ఆ స్థానంలో గౌతమ్ గంభీర్ రానున్నారు. ఇక, కొద్ది రోజులుగా గౌతమ్ గంభీర్ భారత జాతీయ క్రికెట్ జట్టు తదుపరి హెడ్ కోచ్‌గా నియమితులు కానున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక, రాహుల్ ద్రావిడ్ రెండున్నరేళ్ల పాటు టీమిండియా హెచ్ కోచ్‌గా ఉన్నారు. ఈ సమయంలో భారత జట్టు 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో పాటు 2024 టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా కొత్త శిఖరాలను తాకింది. రాహుల్ ద్రావిడ్ ప్లేస్‌లోకి వస్తున్న గంభీర్ సారథ్యంలోనే ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంక పర్యటకు వెళ్లనుంది. గంభీర్ టీమిండియా కోసం ఆడిన అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకరు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో భాగంగా ఉన్నారు. గంభీర్ ఈ రెండు టోర్నీల ఫైనల్స్‌లలో అద్భుతమైన ప్రదర్శన చేశారు. గంభీర్ భారతదేశం తరపున మొత్తం 58 టెస్టు మ్యాచ్‌లు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడారు. 6 వన్డే మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. గంభీర్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే ఆ జట్టు 2012,2014 ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ‘’భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నేను స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. గౌతమ్ ఈ మారుతున్న దృశ్యాన్ని దగ్గరగా చూశారు. తన కెరీర్‌లో ఎన్నో కష్టాలను తట్టుకుని వివిధ రోల్స్‌లో రాణించారు. అలాంటి గౌతమ్ గంభీర్ భారత క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి అనువైన వ్యక్తి అని నేను విశ్వసిస్తున్నాను’’ అని జై షా పేర్కొన్నారు. ఇక, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనను హెడ్ కోచ్‌గా నియమించడంపై సోషల్ మీడియా వేదికగా గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘’భారతదేశం నా గుర్తింపు.. నా దేశానికి సేవ చేయడం నా జీవితంలో గొప్ప హక్కు. నేను వేరే పాత్రలో ఉన్నప్పటికీ.. తిరిగి వచ్చినందుకు (టీమిండియాలోకి) గౌరవంగా భావిస్తున్నాను. కానీ నా లక్ష్యం ఎప్పటిలాగే ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడం. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల భూజాలపై 1.4 బిలియన్ల భారతీయుల కలలు ఉన్నాయి. ఈ కలలను నిజం చేయడానికి నేను నా శక్తి మేరకు ప్రతిదీ చేస్తాను!’’ అని గంభీర్ పేర్కొన్నారు.