Logo
Date of Publish : 18 March 2026, 9:18 pm
Editor : CH. MUKUNDARAO

ఉగాది పర్వదినం తెలుగువారికి ప్రత్యేకం : అద్దేపల్లి పురుషోత్తం

విళ్లివాకం న్యూస్: ఉగాది పర్వదినం తెలుగువారికి ప్రత్యేకమైనదని సుప్రీంకోర్టు న్యాయవాది అద్దేపల్లి పురుషోత్తం తెలిపారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆద్వర్యంలో 'పరాభవ ఉగాది వేడుకలు' ఆహ్లాదకరమైన వాతావరణంలో బుధవారం ఎంతో విశిష్టంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభ సమావేశంలో తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. పాండురంగం కాళియప్ప స్వాగతం పలికారు. అరుణా శ్రీనాథ్ ఆలపించిన 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' ప్రార్ధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విచ్చేసిన శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగను తెలుగు వారి సమక్షంలో తెలుగుశాఖలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అందరికి పరాభవ ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అద్దేపల్లి పురుషోత్తం ఉగాది పర్వదినం తెలుగువారికి ప్రత్యేకమైనదని, అటువంటి రోజుని తెలుగుశాఖలో ఆచార్య విస్తాలి శంకరరావు తెలుగువారి మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతూ, వారిని అభినందించారు. ఈ సమావేశంలో ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డా. ఏ.వి. శివకుమారి మాట్లాడుతూ మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మొదటగా ఉగాది కార్యక్రమం నిర్వహించిందని, తెలుగువారిగా మద్రాసు వాసులమైన మాకు ఎంతో ఆనందం కలిగించే విషయమని పేర్కొన్నారు.

ఈ ప్రారంభ సమావేశంలో భాగంగా డా. జొన్నలగడ్డ వెంకటరమణ కోయిలమ్మ కుహు కుహు నాదాలు, లేలేత మామిడి చివురులు, విరబూసిన వేపు పువ్వులు వసంతాగమానికి సూచికలని, షడ్రుచుల కలగలిసినదే జీవితమని ఇలా అనేకమైన ఉగాది విశిష్టతలను శ్రోతలకు తెలియజేశారు. పెద్దోజు నరేష్ పంచాగ పఠనం గావించారు. ఆ తర్వాత కూచిపూడి నృత్యాన్ని డా. ఆర్. శివకుమార్ ప్రదర్శించి శ్రోతలను అలరించారు.
ఈ ప్రారంభ సమావేశం అనంతరం రెండు పుస్తకావిష్కరణల కార్యక్రమం జరిగింది. మొత్తం రెండు పుస్తకాలను పుస్తకావిష్కర్తగా విచ్చేసిన తమ్మినేని బాబు ఆవిష్కరించారు.

అందులో మొదటగా డా. అముక్తమాల్యద రచించిన "పసి 'డి' మనస్సు' (కథా సంపుటి)ని డా. జి. లలిత తొలి ప్రతి స్వీకరించగా, సరోజినీ ప్రేమ్ చంద్ సమీక్షించారు. రెండవ పుస్తకం డా. మాదా శంకరబాబు రచించిన 'వ్యాస ప్రభావతి' (సాహితీ వ్యాస సంపుటి) ని డా. మామిడి మురళి సమీక్షించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ ఈ పుస్తకాలు రెండూ వైవిధ్యమైనవని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షతన తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం అందిస్తున్నటువంటి ఉగాది పురష్కారాన్ని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, హిందీశాఖ ఆచార్యులు డా. జి.వి. రత్నాకర్ కు ఆచార్య విస్తాలి శంకరరావు చేతుల మీదుగా పరాభవ నామ సంవత్సర ఉగాది పురష్కారాన్ని అందించారు. ఆచార్య జి.వి. రత్నాకర్ మాట్లాడుతూ మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉగాది పురస్కారన్ని అందుకోవడం ఎంతో అదృష్టం అని తెలుపుతూ, తెలుగుశాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు హాస్యపు వినోదాన్ని జ్యోష్యుల ఉమ 'టీ' దండకం మరియు గయ్యాళి భార్య ఉగాది పంచాంగం అనే అంశాలతో చక్కని హాస్యామృతాన్ని శ్రోతలకు అందించారు. చివరగా తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. మాదా శంకరబాబు వందన సమర్పణతో ఈ కార్యక్రమం పూర్తయింది. మధ్యాహ్నం ఉగాది విందు అనంతరం 2.00 గంటలకు ఉగాది కవి సమ్మేళన సభకు డా. చవితి రాధాకృష్ణ స్వాగతం పలకగా, అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావుగారు ఉగాది కవితల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన కాశీ సోమయాజుల రమణి ఉగాది తెలుగువారికి ఆది పండుగని, అలాంటి పండుగను విశ్వవిద్యాలయంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కవిసమ్మేళన నిర్వహణను వల్లాప్రగడ స్రవంతి గారు నిర్వహించారు. ఈ కవిసమ్మేళన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 75 మంది తమ కవితలను చదివారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య సి.ఎం.కె. రెడ్డి, కాకుటూరు అనిల్
కుమార్ రెడ్డి, ఆచార్య ఎల్.బి. శంకరరావు దంపతులు, మంగళా కందూర్ తదితరులు పాల్గొన్నారు.
చివరగా జాతీయ గీతంతో శ్రీ పరాభవ ఉగాది వేడుకలు పూర్తయ్యాయి.

.........


All Rights Reserved By telugunewstimes
Print Save