
చెన్నై: శ్రీ విశ్వ వసు నామ ఉగాది వేడుకలు ఆస్కా (ఆంధ్ర సోషల్ & కల్చరల్ అసోసియేషన్ ట్రస్ట్) ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చెన్నై, టీ నగర్ విజయ రాఘవ రోడ్డులోని ఆస్కా గోదావరి హాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడాయి.
వేడుకలు ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించి, వేద ఆశీర్వాదాలతో ఉగాది పచ్చడి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మధుర కళానికేతన్ బృందం డాక్టర్ మాధవి మల్లంపల్లి నేతృత్వంలో “కిన్నెరసాని” అనే కూచిపూడి నృత్య నాటికను ప్రదర్శించింది.
డాక్టర్ నరాల రామరెడ్డి గారు “అవధాన సాహిత్యంలో సొగసులు” అనే అంశంపై విలువైన ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథులుగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ డాక్టర్ డి. సుధాకర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ శ్రీమతి మధులత నాగిరెడ్డి పాల్గొన్నారు. వీరిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ డి. సుధాకర్ రావు మాట్లాడుతూ, “ఆస్కాలో ఉగాది వేడుకల్లో పాల్గొనడం ఆనందదాయకం. తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం మధురమైన అనుభూతిని కలిగించింది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని చెప్పారు.
సభకు ఆస్కా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె. సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా, మేనేజింగ్ ట్రస్టీ పి. శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ ఏ. ఆదినారాయణ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరై ఉగాది ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
……………