Logo
Date of Publish : 04 December 2024, 11:36 pm
Editor : CH. MUKUNDARAO

గాన గంధర్వుడు ఘంటసాల కారణజన్ములు

విల్లివాకం న్యూస్: గాన గంధర్వుడు ఘంటసాల కారణజన్ములని పెద్దాడ సూర్య సుబ్బలక్ష్మి తెలిపారు. తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం, జనని సాంఘిక సాంస్కృతిక సమితి, చెన్నై, సంయుక్త నిర్వహణలో 'అమర గాయకుడు ఘంటసాల 102వ జయంతి' కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. దీనికి చెన్నై పెరంబూరు, డీఆర్ బిసిసిసి మహోన్నత పాఠశాల, శ్రీముక్కాల నమ్మాళ్వార్ శ్రేష్ఠి ఆడిటోరియం వేదికయింది. కార్యక్రమంలో ముందుగా నిడమర్తి వసుంధర దేవి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు.

జనని అధ్యక్షులు డాక్టర్ నిర్మలా పళనివేలు అధ్యక్షత వహించారు. తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం,
అధ్యక్షులు, తమ్మినేని బాబు, రెప్కో బ్యాంక్, విశ్రాంత జనరల్ మేనేజర్, వంజరపు శివయ్య,
గాయకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం, ఆకాశవాణి
చెన్నై కేంద్రం, పెద్దాడ సూర్య సుబ్బలక్ష్మి
వక్తలుగా విచ్చేశారు. డాక్టర్ నిర్మలా పళనివేలు మాట్లాడుతూ కవీశ్వరులకు, కళాకారులకు మరణం లేదని, ఘంటసాల చిరంజీవులు, ప్రాతస్మరణీయులని అన్నారు.

తమ్మినేని బాబు మాట్లాడుతూ తెలుగువారికి దక్కిన వరప్రసాదం ఘంటసాల అన్నారు. వంజరపు శివయ్య మాట్లాడుతూ ఘంటసాల తెలుగువారై పుట్టినందుకు మనమంతా గర్వపడాలని అన్నారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. పెద్దాడ సూర్య సుబ్బలక్ష్మి మాట్లాడుతూ పాటకు కొత్త సవ్వడిని అందించిన గొప్ప గాయకుడు ఘంటసాల అన్నారు. ఆయన కారణజన్ములు అంటూ జీవిత విశేషాలను విపులంగా పంచుకున్నారు. ఎంఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఘంటసాల స్వరంలో మాధుర్యం మనలను ఆకట్టుకుంటుందన్నారు. రమాదేవి ఘంటసాల సుస్వర స్వరం.. పాటల సమాహారం అనే కవితను చదివి వినిపించారు.

చివరిగా ఎన్ వివి సారధి వందన సమర్పణ చేశారు.
కార్యక్రమ నిర్వహణ తమిళనాడు తెలుగు
సాంస్కృతిక సంఘం, కార్యదర్శి, పి.ఆర్ కేశవులు
చేపట్టారు. ఇందులో ఎంఆర్ సుబ్రహ్మణ్యం
బృందం సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గూడపాటి జగన్మోహనరావు, శ్రీ లక్ష్మీ మోహనరావు తదితర తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు


All Rights Reserved By telugunewstimes
Print Save