విల్లివాకం న్యూస్: ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములని ఆంధ్రప్రదేశ్ మేరిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తెలిపారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 124 వ జయంతి కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
దామచర్ల సత్యనారాయణ విచ్చేశారు.
కార్యక్రమంలో ముందుగా ఎన్ వసుంధరా దేవి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. కార్యదర్శి, కోశాధికారి బి కృష్ణారావు స్వాగతోపన్యాసం చేశారు. చైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. ముఖ్య అతిథి దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని అన్నారు. ఆ మహానుభావుడి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకం అన్నారు. ఈ పొట్టి శ్రీరాములు స్మారక భవనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి చొరవ చూపిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కమిటీ సభ్యుడు, సినీ గేయ రచయిత భువనచంద్ర గురువుల గొప్పతనాన్ని వివరించారు. ఇందులో సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ, కమిటీ సభ్యులు డా. ఎంవి నారాయణ గుప్తా, విస్తాలి శంకరరావు, గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ ఏవి శివకుమారి, జేఎం నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్రంలో ఇంతవరకు తెలుగు భాషకు కృషి చేసిన అధ్యాపకులకు సత్కార కార్యక్రమం జరిగింది. ఎల్ బి శంకర రావు, విస్తాలి శంకరరావు సహా 31 మంది అధ్యాపకులు, ఆచార్యులు, ఉపాధ్యాయులు సత్కారంతోపాటు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. చివరిగా ఎం.వి నారాయణ గుప్తా వందన సమర్పణ చేశారు. ముందుగా అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెలుగు భాషాభిమానులు అనేక మంది విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
............
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com