Logo
Date of Publish : 06 July 2024, 9:04 pm
Editor : CH. MUKUNDARAO

కొత్త నేరచట్టాల్లో మంచి ఉద్దేశ్యం వున్నా!!.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అవుతాయి!!

ద్వారంపూడి పై న్యాయ సంహిత నాన్‌ బెయిలబుల్‌ విచారకరం!!

సామాజిక వేత్త దూసర్లపూడి

నూతన పార్లమెంట్‌ కొత్త నేర చట్టాలను పునః సమీక్షించాలి

కాకినాడ, జూలై 06 : కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన మూడు నేర చట్టాల్లోని భారత న్యాయ సంహితలోని 132ఆర్‌ డబ్ల్యూ (3)5 ప్రకారం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పై కేసు నమోదు కావడం పట్ల పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు విచారం వ్యక్తం చేశారు. ద్వారంపూడి పై వున్న రాజకీయ టార్గెట్‌ రీత్యా అధికార ప్రతిపక్షాల మధ్య ఎవరు ఎటు వంటి కేసులు పెట్టుకున్నా ఎవరికీ నష్టం లేదన్నారు. గతంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 353 సెక్షన్‌ను కొత్తగా అమలులోకి తెచ్చిన సంహితలోని 132గా మార్చి కాగ్నజబుల్‌ నాన్‌ బెయిలబుల్‌ చేయడం దురదృష్టకరంగా వుందన్నారు. సామాన్యులకు అన్యాయం జరిగితే రాజకీయ అధికార ప్రతినిధులు అధికారులు కుమ్మక్కయితే వారిని ప్రశ్నించే అవకాశం లేకుండా ప్రజాస్వామ్య హననానికి దారి తీసే విధంగా వుంటుందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వాల అవినీతి అక్రమాలు వెలికితీయడం జరుగుతున్నదంటే ప్రశ్నించే హక్కు వుండడం వలన జరుగుతున్నదన్నారు. ప్రశ్నించే హక్కు అధికారాన్ని పౌరులకు లేకుండా హరించే ధోరణి వలన అధికార ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు అన్యాయాలు జరిగినా ప్రశ్నించే  పౌర గొంతుకలు శూన్యం కాబడతాయన్నారు. కొత్త నేర చట్టంలో మంచి ఉద్దేశ్యం కనిపిస్తున్నా ఆచరణలో ప్రజాస్వా మ్యానికి హాని కలిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు ఎన్ని కేసులు వున్నా సుప్రీం స్థాయిలో కోట్ల రూపాయల బడ్జెట్‌ పెట్టుకుని వాదించుకుని వారికి ఏమీ కాకుండా చెలామణీ కాగలుగుతారని తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత కేసులు మాఫీ చేసుకుంటారన్నారు. కానీ సామాన్యుల విషయంలో అటువంటి అవకాశంలేదన్నారు. సామాన్యుల కోసం ప్రశ్నించే ప్రజాస్వామ్యాన్ని సమాజానికి దూరం చేసే రీతిలోఅందని ద్రాక్షగా కొత్త నేర చట్టాలతో అయోమయం కలిగించడం శ్రేయస్కరం కాదన్నారు. ప్రవేశ పెట్టిన కొత్త నేర చట్టాలను నూతన పార్లమెంట్‌ సభ మరోసారి పునః చర్చ చేయాల్సిన అవసరంవుందన్నారు. కొందరి నేరస్తుల కోసం అందరినీ ఇబ్బంది పెట్టే చట్టాల ప్రయోగం రాజకీయంగా అధికారంలో వున్న వారికి తాత్కాలిక సంతోషం ఇవ్వగలదుగాని తుదకు భస్మాసుర హస్తం అవుతుందన్నారు. కొత్త చట్టాలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగలేదన్నారు. ప్రజలకు అవగాహన కలిగించలేదన్నారు. పులి మీద పుట్రలా ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పిందే రాజ్యాంగంగా పాటిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో కొత్త న్యాయ సంహితలు ప్రజాస్వామ్యానికి దాపురించిన ప్రమాద ఘంటికలుగా వున్నాయని పేర్కొన్నారు.


All Rights Reserved By telugunewstimes
Print Save