Logo
Date of Publish : 11 February 2026, 7:01 am
Editor : CH. MUKUNDARAO

“ఘంటసాల జీవన జీవం గానం”

ఘంటసాల అంతగా అనుభవం లేని రోజుల్లో చేసిన సంగీత కచేరి విఫలమైంది. ఆ విఫలమే సంగీత
సరస్వతికి ఓ గాన గంధర్వుణ్ణి అందించినది.
ఆనాడు అవహేళన చేసినవారికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. పట్టుదలతో విజయనగరంలోని
సంగీత కళాశాలలో సంగీత విద్వాంసులు ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల నారాయణదాసు గార్ల
వద్ద శిష్యరికం చేశాడు. ఆయన ఆ పట్టుదలే ఒక్క ఆంధ్రదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే ఓ
అమరగాయకుణ్ణి అందించినది.
ఆయన ప్రజ్ఞాప్రాభవాన్ని గుర్తించిన గురుతుగా ఆయన గురువు వెంకటస్వామినాయుడుగారిచ్చిన
వీణ యిప్పటికీ ఆయన ఇంటిలో భద్రంగా వుండడం ఆయన గురుభక్తికి నిదర్శనం.సంగీత కచేరీలు చేద్దామని చెన్నైకి వచ్చిన ఘంటసాల చలనచిత్ర గాయకుడిగా రూపాంతరం చెందడంతెలుగు చలనచిత్ర పరిశ్రమ అదృష్టమనే చెప్పాలి.1922 వ సంవత్సరము డిసెంబరు 4 న గుడివాడ చౌటపల్లి గ్రామవాస్తవ్యులు సూర్యనారాయణ రత్తమ్మ దంపతులకు జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు తన సంగీత జీవనయాత్రలో ఎన్నో బహుమతులు
మరెన్నో ప్రజా సంఘాల పురస్కారాలు అన్నింటినీ మించి కోట్లాది ప్రజల అభిమానం ఆయన చెంతకు
చేరాయి.మానవతా విలువలు మంటకలిసిపోతున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలు ఈనాడు మచ్చుకైనా
కానరావడం లేదు. దిశానిర్దేశం లేక ప్రజకు ముఖ్యంగా యువతం పెడత్రోవ పడుతుందనే ప్రగతిశీలుర
ఆవేదన తీరాలంటే ఘంటసాల గానామృతాన్ని పంచాలి.
" జగదభిరాముడు శ్రీరాముడే”, “ అహెూ లీలామానుష వేషధారి! మురారీ!", " నను పాలింపగ నడచి
వచ్చితివా గోపాలా” అంటూ దేవదేవుని కీర్తించే ఆ పాటలు మధుర గాయకుడు ఘంటసాల గారి నోటి
ద్వారా వింటుంటే మనము భక్తి సాగరములో మునుగుతాము, తద్వారా మధురానుభూతిని పొందుతాము. " కలిమి కన్నా చెలిమి మిన్న కలవు మణులెన్నో నీలోన”, “ మనసంత నీకు మందిరముగా మమతలేపూవులుగా, కానుకగా అర్పించి నీకై కలకాలం జీవించనా" అంటూ ప్రియురాలికి తనను అర్పించుకొనే
పాటైన, " నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా” అంటూ అతివ అందాన్ని వర్ణించే
పాటైనా, " ఎక్కడవున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుకున్న నిను వీడి అందుకే వెళ్ళు
తున్నా" అనే భగ్న ప్రేమికుని హృదయ స్పందనను తెలిపే పాటైనా, “ ఊహలు గుసగుసలాడే మన హృదయము
ఊయ్యలలుగే” అంటూ “ ప్రేయసీ ప్రియుల గుసగుసలు తెలిపే పాటైనా,“ ఒకనాటి ఉద్యానవనము నేడు
కనము ... అదియే మరు భూమిగా నీవు మార్చేవులే " అంటూ విధి వ్రాతకు గురైన ఓ అభాగ్యుని వ్యధ తెలిపే

పాటైనా, “ ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరు సుఖపడాలి నందనందనా” అంటూ భవిష్యత్తుపై
ఆశను చిగుర్చే పాటైనా, “ అందరికోసం ఒక్కడు నిలిచి ఒక్కడి కోసం అందరు కలసి" అంటూ సమతా
మమతల సంస్కృతిని తెలిపే ప్రబోధ గీతమైనా ఘంటసాల పాడితేనే, ఆనందం అందులోనే లో వుంది
అర్థం, పరమార్థం.పాడే ఆ ఒక్కొక్క పాట ఆయన పాడుతూ ఉంటే అందు ఒక్కొక్క పలుకు ఓ అమృత ధారయై చివరికిఅమృతవాహినిగా ప్రవహిస్తుంది. పాటలోని ఉచ్ఛారణ, తెలిపే భావం, పలికే భాష, ఆయనకే అది సాధ్యం.మరెవరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదేమో! అలా మధురమైన తన కంఠంతో పాటలను పాడి, అటుసంగీతానికి ఇటు మధురమైన మన మాతృభాషకు కీర్తిప్రతిష్టలు ఆర్జించి పెట్టిన ఆ మధుర గాయకుడుమనల నుండి విడిపోరు, మన మదిలో ఎప్పుడూ చిరస్థాయిగా వుంటారు.
పాట వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచేది. ఆయన పాటలు ఆపాతమధురం. దేశభక్తిపూరితమై,
ప్రేమానురాగాలు పంచే సఖ్యతా సౌభ్రాతృత్వాన్ని తెలియచేసే ఆయన పాటలను విరివిగా ప్రచారం చేయాలి.పాశ్చాత్య సంగీతానికి బానిసలై పరవళ్లు తొక్కుతున్న యువతరంలో మార్పు తేవాలి. అందుకు సాంస్కృతికసంఘాలు ముందుకు రావాలి.
పాడుతూనే చనిపోవాలనేవారు ఘంటసాల., అలా సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా
వెలిగిన ఘంటసాల ఆ సంగీత సేవలో తరిస్తూనే 1974 ఫిబ్రవరి 11 న తనువు చాలించారు. అయినా
సంగీతం ఓ ప్రవాహం. అది ప్రవహిస్తూనే వుంటుంది. అలాగే ఘంటసాల పాటలు జనహృదయాల్లో
నిలిచిపోయాయి. అవి విడిపోవు.
' పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం'-అవును. అందుకే ఘంటసాల మరణించలేదు. సంగీతం వున్నంత కాలంఆయన జీవించే వుంటారు.
-గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై ,సంచారవాణి 9790783377.

(అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 52వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)


All Rights Reserved By telugunewstimes
Print Save