
టీ నగర్ న్యూస్: కులమత భేదాలు లేకుండా తమిళనాడులో నివసించే తెలుగు ప్రజలంతా ఐక్యతతో ఉంటే, మన భాషను కాపాడుకుంటూ, మన హక్కులను సాధించుకోవచ్చని అఖిల భారత తెలుగు సమైక్య అధ్యక్షుడు ఆచార్య సీఎం కే రెడ్డి పిలుపునిచ్చారు.
చెన్నై సమీపంలోని పుళల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది 2025 పేరిట తొమ్మిదవ ఉగాది వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీదేవి భూదేవి సమేత కార్య మనికల పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.అనంతరం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ జెట్ సమాజం మండపంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆచార్య సీఎం కే రెడ్డి, అతిథులుగా ఏ ఐ టి ఎఫ్ జనరల్ సెక్రటరీ నందగోపాల్, వైస్ ప్రెసిడెంట్ లయన్ విజి జయకుమార్, ద్రావిడ దేశం పార్టీ అధ్యక్షుడు వి కృష్ణారావు, తమిళనాడు కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తాళ్లూరి సురేష్ పాల్గొన్నారు.
వేడుకల్లో ఆరుద్ర నాట్యాలయం, శ్రీ గృహన్ జాలి భరతనాట్య అకాడమీ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆచార్య సీఎం కే రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడులో రెండవ అత్యధికంగా మాట్లాడే భాష అయినా తెలుగువారికి సమాన హక్కులు అందటం లేదని, అవి సాధించేందుకు ఐక్యత అవసరమని తెలిపారు. పుళల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం ప్రతి ఏడాది ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎం అరుల రాశి అనే విద్యార్థికి చదువు కోసం వి. బాబూజీ, కవిత ₹20వేలు సహాయం చేశారు.
ఉగాది వేడుకల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని సంఘ గౌరవ అధ్యక్షుడు లయన్ జి మురళి, చీఫ్ కోఆర్డినేటర్ జివి రామకృష్ణ, సంఘ ప్రెసిడెంట్ పి నరసింహారావు, సెక్రటరీ ఎం చిట్టిబాబు, ట్రెజరర్ ఎం మునుస్వామి, ఉపాధ్యక్షులు బి కృష్ణయ్య, డి గోపాలకృష్ణ, ఐ వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీలు లయన్ బి బాలాజీ, వి బాపూజీ, బి నాగరాజు, సలహాదారులు జి వెంకయ్య, బి గురువారెడ్డి, బి దామోదర చెట్టి, ఎం వాసు, బి నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షించారు. తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా ఉగాది వేడుకలను జరుపుకున్నారు.