చెన్నై న్యూస్ :చెన్నై సమీపంలోని మధురాంతకంలో నిర్వహించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలనాత్మక ప్రసంగం చేశారు. డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించే దిశగా కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఆయన ప్రకటించారు.
తమిళ సోదర సోదరీమణులకు తమిళంలో అభివాదం చేసిన ప్రధాని, 2026లో తన తొలి తమిళనాడు పర్యటన ఇదేనని తెలిపారు. పొంగల్ పండుగ, ఎంజీఆర్ జయంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వంటి విశేష రోజుల్లో తమిళనాడుకు రావడం ఆనందంగా ఉందన్నారు.
మధురాంతక సరస్సును కాపాడిన శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తూ, తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించినట్లు తెలిపారు. సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు తమిళనాడు మార్పు కోరుకుంటోందనే స్పష్టమైన సంకేతం ఇస్తున్నారని అన్నారు.
డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అవినీతి, మాఫియా, దోపిడీ పాలన సాగిస్తోందని ప్రధాని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే అంటే “కలెక్షన్–మాఫియా–కరప్షన్” ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇక డీఎంకే పాలనను సహించేందుకు సిద్ధంగా లేరని, రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు ఎన్డీఏ కూటమి అవసరమని స్పష్టం చేశారు.
తమిళనాడును డీఎంకే పాలన నుంచి విముక్తి చేయడమే ఎన్డీఏ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని మోదీ తెలిపారు. డీఎంకే ప్రభుత్వానికి ముగింపు పలికే రోజు దగ్గరపడుతోందని స్పష్టంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), పీఎంసీ నేత అన్బుమణి రామదాస్, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ “భారత్ మాతా కీ జై” నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com