* భక్తజన సందోహంతో వెల్లివిరిసిన శైవ భక్తి
చెన్నై న్యూస్:చెన్నై మహానగరంలోని తిరువల్లికేణి రామ్ నగర్లో ఉన్న శ్రీ నాగదేవత ఆలయం శనివారం రాత్రి శైవ భక్తితో పరవశించింది. మార్గళి మాస శుభసంధర్భంగా నిర్వహించిన ఆరుద్ర మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగింది.
ఈ పర్వదినాన ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాల అలంకరణతో కళకళలాడింది. నాగదేవత, నటరాజ స్వామి సహా ఇతర దేవతా విగ్రహాలకు సాంప్రదాయ విధానంలో పాలు, చందనం, కుంకుమ, పుష్పాలతో విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం 101 శంఖాలతో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తుల మనసులను ఆధ్యాత్మిక ఆనందంతో నింపాయి.
పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ పవిత్ర ఆరుద్ర పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆరుద్ర మహోత్సవం సందర్భంగా రామ్ నగర్ పరిసరాలు శైవ నామస్మరణతో మార్మోగుతూ, భక్తి రసంతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
...........
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com