127వ జయంతి (4.7.1897) సందర్భంగా అక్షర సుమాంజలి
భారతస్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఆంధ్రుల తూర్పు ఏజెన్సీలో ఎగసిన మహోజ్వల అధ్యాయం అల్లూరిసీతారామ రాజు ఉద్యమం. పేదప్రజల సంక్షేమం కోసం సాయుధ పోరాటంతో 27 ఏళ్ల వయస్సులో ప్రాణాలర్పించిన వీర యోధుని జీవితం. బ్రిటీష్ శక్తిని ఎదుర్కొన్న ధీశాలి సీతారామరాజు.
1897జూలై 4 హేవళంబి నామ సంవత్సర ఆషాఢమాస శుద్ధ పంచమి 23ఘడియల 30 విఘడియలలో సాయంత్రం 4గంటలకు మఖానక్షత్రయుక్త వృశ్చికలగ్నంలో విజయనగరం పాండ్రంగి గ్రామంలో జన్మించారు. తల్లి సూర్యనారాయణమ్మ తండ్రి వెంకటరామరాజు. వీరు 1902లో రాజమండ్రి నందు స్థిరపడ్డారు. 6వ తరగతి చదువుతున్న వయసులో తండ్రిని కోల్పోయారు. 1909లో భీమవరం మిషన్ ఉన్నత పాఠశాలలో మొదటి ఫారం చేరి ఆ వయస్సులోనే గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. 1911లో రాజమహేంద్రవరం నందు ఆరవ తరగతి 1912లో తూర్పుగోదావరి రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారం చేరారు. మద్దూరి అన్నపూర్ణయ్య సహాధ్యాయిగా వున్నారు. విశాఖలో నాల్గవ ఫారం ఆరోగ్య కారణాలతో మరుసటి ఏడు నర్సాపురంలో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరడం.. ఆ కాలంలోనే చుట్టు పక్కలగల కొండలు అడవులలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనించడం, ధారకొండ, కృష్ణదేవీ పేట ప్రాంతాలలో జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నారు. చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికత, నాయకత్వ లక్షణాలు, దానగుణం ఉన్నాయి. తుని గోపాల పట్టణం సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయం నందు కొంతకాలం తపస్సు చేశారు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను ధ్యానం చేసేవారు. దేవీ పూజలు చేసేవారు. శ్రాద్ధ కర్మల సంప్రదాయాలను పాటించేవారు. 1916 ఏప్రిల్ 26న ఉత్తర భారత దేశయాత్ర చేశారు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా లక్నోలో కాంగ్రెసు మహాసభకు హాజరయ్యారు. కాశీలో మరింతగా సంస్కృత భాషను అధ్యయనం చేసారు. బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం పర్యటించి సన్యాస దీక్షతో యోగిగా మారారు. మరల కృష్ణదేవు పేట ధారకొండ పై కొన్నాళ్ళు తపస్సుచేసారు. 1918లో మళ్ళీ దేశాటన చేపట్టి బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు పర్యటించారు. ఆ రోజుల్లో ఏజన్సీ నందు తెల్లదొరల దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు, శ్రమదోపిడి, ఆస్తులదోపిడి, స్త్రీల మానహరణం జరుగుతుండేవి. గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు ఆరణాల కూలీ అనిచెప్పి అణా ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ సరిపోయేదికాదు. ఆకలి మంటలకు తట్టుకోలేక ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండేవారు. కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటిని వారి భాషలో పితూరీ అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నారు. వారికి హక్కులను వివరించి ధైర్యాన్ని పెంపొందించి అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసారు. ప్రజలు ఆయన వద్ద సలహాలకు వివాద పరిష్కారాలకు వచ్చేవారు. 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యారు. మన్యంలోని గిరిజనులను సమీకరించి వారిని దురలవాట్లకు దూరం చేసి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి పోరాటానికి సిద్ధం చేయ్యసాగారు. అతని అనుచరుల్లో గాము గంటందొర, మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు ముఖ్యులుగా వున్నారు. గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారైన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై కూలీలకు సరైన కూలీ ఇవ్వక ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించే వాడు రామ రాజు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై వ్యతిరేక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది సారాంశం. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించి రాజును దూరంగా ఉంచదలచి నర్సీపట్నం, అడ్డతీగల, పైడిపుట్టిలలో అనునిత్యం నిఘాతో ప్రవాసశిక్షగా బందీ చేసారు. పోలవరంలో డిప్యూటీ కలెక్టరుగా పని చేస్తున్న ఫజులుల్లాఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్ లో మన్యం నందు కాలు పెట్టారు. మరల విప్లవానికి వేదిక సిద్ధమయింది. బ్రిటీష్ ప్రభుత్వోద్యోగి ఫజలుల్లాఖాన్ రాజును అభిమానించేవారు. 1922లో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించడం.. విప్లవ మార్గానికి సీతారామ రాజు ఉద్యుక్తుడవ్వడం వారించిన తల్లిని క్షేమం కోసం నరసాపురం పంపించడం.. గంటందొర, మల్లుదొర, మొట్టడం, వీరయ్యదొర, కంకిపాటి, ఎండు పడాలు, సంకోజి, ముక్కడు, వేగిరాజు, సత్యనారాయణ రాజు, అగ్గిరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహస వీరులు 150 మందిని తీర్చిదిద్దారు. పోలీసు స్టేషన్ల పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో మొదటిగా విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు స్టేషన్ పై ఉద్యమించారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాల్లోకి ప్రవేశించి చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులనే విచక్షణ లేకుండా చంపారు. అప్పటి విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశాక ఎర్రజెర్లలో అటకాయించి కాల్పులు జరిపారు. 1924 ఏప్రిల్ 17న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్ ఫర్డ్ నియమితులవ్వడం.. వారం రోజు =లలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చి వేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించడం.. 1924 మే7న కొయ్యూరు సమీపంలో ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించడం.. కొయ్యూరులో మేజర్ గుడాల్ వద్ద హాజరుపర్చడం.. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును చెట్టుకు కట్టి విచారణ లేకుండా గుడాల్ తో కాల్చి చంపడం జరిగిపోయాయి. తల్లికి మరణ వార్త తెలియనివ్వకుండా మే 8న రాజు పార్థివ దేహాన్ని ఫొటో తీయించి దహనం చేసిన చితా భస్మాన్ని వరాహ నదిలో కలపడం వంటి దుష్కార్యాలు జరిగిపోయాయి.. ఆ విధంగా 27 ఏళ్ళ వయసులో అల్లూరి సీతారామరాజు అమర వీరుడయ్యారు. ఆయన మరణం దేశ స్వాతం త్ర్యానికి పునాదిగా నిలిచింది. ఎందరో యోధులు, వీరులు, మహనీయులు, మహనుభావులు ఆయనకు స్ఫూర్తిగా ఉద్భవించారు. కృష్ణ దేవిపేటలో వారి సమాధి ఉంది. కాకినాడ పి.ఆర్ స్కూల్ లో ఆయన చదివిన జ్ఞాపకాలున్నాయి. ఆయన అనుచరుడు నందానాగన్న భార్య బాలమ్మకు 120 ఏళ్ల వయస్సులో ఆమె అనారోగ్యం రీత్యా మే16 1989న అమర వీరులసేవగా భావించిన కాకినాడలోని భోగి గణపతి పీఠం మాతృ సంస్థ గణపతి యువజన సంఘం ప్రత్యేక ఆర్థిక సహయాన్ని స్వచ్ఛందంగా శంఖవరం ఈనాడు జర్నలిస్ట్ ద్వారా స్వయంగా అందజేసింది. ప్రతి ఏటా పౌరసంక్షేమసంఘం ఆ విగ్రహానికి నివాళి ఘటిస్తుంది. ప్రకృతి సాక్షిగా గాలి, నీరు, భూమి, అగ్ని, వాయువులతో పంచ భూతాలుగా వున్న సృష్టిలో ప్రకృతి పరమార్ధంగా దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం తనకు తాను సృజించుకున్న ప్రకృతి పరమార్ధంలో ఆవిర్భవించే స్వరూపమే వీరత్వం. అటువంటి ధీరత్వమే అల్లూరి సీతా రామరాజు జననం. అటువంటి మహనీయులకు పుష్పాంజలి ఘటించడం.. మానవత్వాన్ని ఆశించే దైవత్వం కలిగిన పౌర లక్షణం.